కుల పెద్దల మాట వినలేదని వెలి

కుల పెద్దల మాట వినలేదని వెలి
  • బతుకమ్మ ఆడనీయకుండా అవమానం  
  • జనగామ జిల్లా దేవరుప్పలలో దారుణం

పాలకుర్తి(దేవరుప్పుల), వెలుగు: కుల పెద్దల మాట వినలేదని జనగామ జిల్లాలో ఓ కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారు. బాధిత కుటుంబంలోని మహిళలను బతుకమ్మ ఆడనివ్వకుండా గ్రామస్తుల ముందు అవమానించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ కులస్తులు వాటా బందీ పద్ధతిలో గతంలో గ్రామ సేవకులుగా విధులు నిర్వహించేవారు. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్​ ప్రభుత్వం గ్రామంలోని నీరటి అబ్బయ్య అనే వ్యక్తిని వీఆర్ఏగా పర్మినెంట్ చేసింది. వాటాల ప్రకారం కాకుండా ఒక్కడినే ఉద్యోగంలోకి తీసుకోవడంతో అబ్బయ్యను పిలిపించిన కులపెద్దలు కులానికి రూ.3 లక్షలు చెల్లించాలని తీర్మానించారు. అబ్బయ్య ఫ్యామిలీ రెండున్నర లక్షలు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అందుకు ఒప్పుకోని కులపెద్దలు కచ్చితంగా 3 లక్షలు చెల్లించి కాళ్లు పట్టుకుంటేనే కులంలోకి రానిస్తామని తేల్చి చెప్పారు. అప్పటివరకు కులానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకు రావొద్దన్నారు. రెండేండ్లుగా గ్రామంలోని ముదిరాజ్​లు ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా అబ్బయ్య కుటుంబాన్ని పిలవట్లేదు. బుధవారం ముదిరాజ్ మహిళలు ఒకచోట చేరి బతుకమ్మ ఆడుతుండగా అబ్బయ్య కుటుంబ సభ్యులు బతుకమ్మతో అక్కడికి వెళ్లారు. ‘మీతో కలిసి బతుకమ్మ ఆడమని.. దూరంగా వెళ్లాలని’ కొందరు మహిళలు అందరి ముందు వారిని అవమానించారు. దానిపై సర్పంచ్​నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేయగా ఒక్కరి కోసం ఊర్లో అందరినీ ఇబ్బంది పెట్టకూడదని సమాధానం ఇచ్చారు. దాంతో చేసేదేమి లేక బాధితులు బతుకమ్మను నిమజ్జనం చేసి ఇంటిబాట పట్టారు.

రెండేండ్లుగా మమ్మల్ని వేధిస్తున్నరు
మా కుటుంబాన్ని కుల పెద్దలు రెండేండ్లుగా వేధిస్తున్నారు. చావులకు రానివ్వరు, పెండ్లిళ్లకు చెప్పరు. ఎవరైనా మాతో మాట్లాడితే వాళ్లను కూడా వెలివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అడిగిన డబ్బులు ఇచ్చి కాళ్ల మొక్కితేనే కులంలో కలుపుకుంటామని క్షోభకు గురిచేస్తున్నారు. మాపై దాడులు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. మాకు న్యాయం చేయాలి.                                                                                        - నీరటి క్రాంతి, బాధితుడు