సమంతా బర్త్‌డేకు ఓ అభిమాని స్పెషల్ గిఫ్ట్

V6 Velugu Posted on Apr 29, 2021

తమ అభిమాన నటుల కొత్త సినిమాలకు కటౌట్లు పెట్టిన అభిమానులను చూశాం. పుట్టినరోజు వస్తే రక్తదానం చేసిన అభిమానులను చూశాం. మరికొంత మంది ఓ అడుగు ముందుకేసి తమ అభిమాన హీరోల పేర్లను, ఫొటోలను గుండెలపై పచ్చబొట్టు వేయించుకోవడం చూశాం. కానీ తొలిసారిగా టాలీవుడ్‌లో ఓ అభిమాని వాటిన్నికంటే విభిన్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. తాను ఎంతగానో అభిమానించే అగ్ర కథానాయిక సమంత పుట్టినరోజును పురస్కరించుకొని సుమారు 100 మందికి పైగా నిరుపేదలకు ఓ పూట భోజనం పెట్టి ఆమెపై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నాడు. ఓ టెలివిజన్ ఛానల్‌లో కెమెరామెన్‌గా పనిచేస్తున్న చరణ్ తేజకు సమంత అంటే ఎనలేని అభిమానం. సామ్ సినిమా వచ్చిందంటే చరణ్‌కు పండుగే. సామ్ సినిమాలకు సంబంధించి కానీ, వ్యక్తిగతంగా కానీ ఎటువంటి అప్డేట్ వచ్చినా చరణ్‌కు అంతులేని ఆనందం. ఈ క్రమంలో సమంత పుట్టినరోజైన ఏప్రిల్28న ఏదైనా వినూత్నంగా చేయాలని భావించిన చరణ్... కరోనా వల్ల చాలామంది నిరుపేదలకు భోజనం దొరకడం లేదని గ్రహించాడు. అనుకున్నదే తడవుగా.. బసవతారకం ఆస్పత్రి వద్ద ఫుట్‌పాత్‌పై ఆకలితో అలమటిస్తున్న సుమారు 100 మందికి పైగా పేదలకు తన సొంత డబ్బులతో భోజనమందించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. సినిమాల్లో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకునే తన అభిమాన హీరోయిన్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా పేదల ఆకలి తీర్చి శభాష్ అనిపించుకున్నాడు. ఈ అభిమాని చేసిన గొప్ప పనికి సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.

Tagged Movies, samantha, tollywood, samantha akkineni, Samantha birthday, cameraman charan tej, telugu film industry

Latest Videos

Subscribe Now

More News