పరిహారం తక్కువ ఇచ్చారనే మనస్తాపంతో రైతు ఆత్మహత్య

పరిహారం తక్కువ ఇచ్చారనే మనస్తాపంతో రైతు ఆత్మహత్య

 

  • రెండేండ్ల కింద తమ్ముడు..ఇప్పుడు అన్న సూసైడ్‌
  • ఐదెకరాలని చెప్పి, 19 ఎకరాలు తీసుకున్నారని కుటుంబసభ్యుల ఆరోపణ
  • మల్లన్నసాగర్‌‌ తరహాలో రూ.12 లక్షల పరిహారం అడిగితే, రూ.2.40 లక్షలే ఇచ్చారని ఆవేదన
  • న్యాయం కోసం ఐదేండ్లుగా పోరాటం చేస్తుంటే అధికారులు బెదిరిస్తున్నారని వెల్లడి

నాగర్ కర్నూల్ / నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కోల్పోయిన భూములకు ప్రభుత్వం తక్కువ పరిహారం ఇచ్చిందన్న మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్‌‌కర్నూల్‌ జిల్లా కుమ్మెరలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు అల్లాజీ (45) మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కోర్టు తీర్పు మేరకు పరిహారం తీసుకోవాలని అధికారులు నోటీసులివ్వడంతో అల్లాజీ తీవ్ర మనస్తాపం చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. పరిహారం విషయంలో తనకు అన్యాయం జరిగిందని రెండు మూడ్రోజులుగా అల్లాజీ ఆవేదనతో ఉన్నాడని చెప్పారు.

ఈ క్రమంలో పురుగుల మందు తాగి, ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  మరోవైపు, అల్లాజీ తమ్ముడు మల్లేశ్‌‌‌‌ (40) కూడా భూమి పరిహారం విషయంలోనే రెండేండ్ల కింద ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే, పరిహారం ఇవ్వకుండా తమ భూముల్లోకి రావొద్దంటూ పనులను అడ్డుకున్న మరో రైతు పొటేల్​ కృష్ణయ్య(50) అనుమానాస్పద మృతి అప్పట్లో సంచలనంగా మారింది. 

పరిహారం ఇవ్వకుండానే  మెగా కంపెనీ ప్రాజెక్టు పనులు..

పాలమూరు, -రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్‌‌‌‌లో భాగంగా కుమ్మెర వద్ద నిర్మించే వట్టెం పంప్ హౌస్‌‌‌‌​ కోసం అల్లాజీ అన్నదమ్ములకు చెందిన 19 ఎకరాల భూమిని సేకరించనున్నట్టు 2016లో ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఎకరానికి రూ.2.40 లక్షల చొప్పున పరిహారాన్ని అధికారులు ఫిక్స్ చేశారు. అయితే, ప్రభుత్వం పరిహారం ఇవ్వకముందే మెగా కంపెనీ భూమిని స్వాధీనం చేసుకొని, పనులు ప్రారంభించింది. మూడు పంటలు పండే భూమిని రెవెన్యూ అధికారులు గుట్టల ప్రాంతంగా చూపించి తక్కువ పరిహారం ఖరారు చేశారని బాధిత రైతులు చెప్పారు. మల్లన్నసాగర్ తరహాలో ఎకరానికి రూ.12 లక్షలు ఇవ్వాలంటూ అల్లాజీతో పాటు మరో 10 మంది రైతులు 2019లో హైకోర్టును ఆశ్రయించారు.

ALSO READ:సాఫ్ట్​వేర్ జాబ్​ మానేసి డ్రగ్స్ దందా

అయితే, వివిధ కారణాలతో కోర్టు వాయిదాలకు వారు హాజరు కాలేదు. దీంతో ఎకరానికి రూ.2.04 చొప్పున పరిహారం చెల్లించాలని గత ఫిబ్రవరిలో తీర్పు చెబుతూ హైకోర్టు కేసును క్లోజ్ చేసింది. కుమ్మెర రైతులు రూ.2.04 లక్షల పరిహారం తీసుకునేందుకు మొదట ఒప్పుకున్నారని తీర్పులో పేర్కొంది. ఆ డబ్బును ల్యాండ్ ట్రిబ్యునల్‌‌‌‌లో జమ చేయాలని చెప్పింది. అయితే, తాము రూ.2.04 లక్షలకు ఒప్పుకున్నట్టు కోర్టుకు ఎవరు చెప్పారో తెలియడం లేదని ఆయా రైతులు పేర్కొంటున్నారు. కాగా, కోర్టుకు ఆశ్రయించే కంటే ముందే, తమకు న్యాయం చేయాలంటూ కుమ్మెర రైతులు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌‌‌ రెడ్డి దగ్గరికి వెళ్లామని చెప్పారు. మల్లన్నసాగర్ తరహాలో పరిహారం ఇప్పిస్తానని మూడేండ్లు ఎమ్మెల్యే తమను తిప్పించుకున్నాడని, ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. దీంతో 2019లో కోర్టుకెళ్లామని రైతులు తెలిపారు. అయితే, కారుకొండకు చెందిన 30 మంది రైతులు అంతకంటే ముందే కోర్టుకు వెళ్లగా, వారికి ఎకరానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు.

ఐదెకరాలని చెప్పి, 19 ఎకరాలు తీసుకున్నరు.. 

మేము నలుగురు అన్నదమ్ములం. మాకు కుమ్మెరలో 19 ఎకరాల భూమి ఉంది. వట్టెం పంప్‌‌‌‌ హౌస్‌‌‌‌ కోసం 5 ఎకరాల భూమి ఇవ్వాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెబితే అంగీకరించాం. ఎకరాకు రూ.2.40 లక్షలకు అవార్డు ఇచ్చారు. చివరికి 19 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదే విషయమై ఎన్నోసార్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను కలిసిన ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపై హైకోర్టుకు వెళ్లాం. కొన్ని కారణాల వల్ల వాయిదాలకు హాజరు కాలేకపోయాం. అయితే, మేము రూ.2.04 లక్షలకు ఒప్పుకున్నట్లు కోర్టుకు ఎవరు సంతకాలు చేసి ఇచ్చారో తెలియదు. మెగా కంపెనీ సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్ ప్రేమ్ కుమార్ మా అన్నను ఎన్నోసార్లు అవమానించాడు. భూమి వైపు వస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించాడు. గతంలో పురుగుల మందు తాగి చావమని తిట్టాడు. బుధవారం ఆస్పత్రిలో చనిపోయే ముందు కూడా మా అన్న అల్లాజీ.. ‘ప్రేమ్ సార్‌‌‌‌‌‌‌‌కు చెప్పండి.. నేను పురుగుల మందు తాగిన’ అని చెప్పాడు. 

‑ అనంత మైబు, అల్లాజీ తమ్ముడు