ఆస్పత్రి బిల్లు కట్టలేక నిర్వాసితుడి ఆత్మహత్య

ఆస్పత్రి బిల్లు కట్టలేక నిర్వాసితుడి ఆత్మహత్య

 

  •    16 ఏండ్ల కింద కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ కోసం భూమి ఇచ్చిన రైతు బాబు 
  •     ఉపాధి చూపని ఆఫీసర్లు 
  •     మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం 
  •     ఆస్పత్రిలో రూ.60 వేల బిల్లు.. 
  •     అధికారులు బిల్లు చెల్లించకపోవడంతో సూసైడ్.. భూపాలపల్లిలో ఘటన  

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/రేగొండ, వెలుగు: కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) కింద మూడెకరాల భూమి కోల్పోయిన రైతు.. తనకు ఉపాధి చూపాలని 16 ఏండ్లు అధికారుల చుట్టూ తిరిగాడు. తన కొడుకుకు అయినా కేటీపీపీలో ఉద్యోగం ఇవ్వాలని ఆఫీసర్లను వేడుకున్నాడు. కానీ ఎవరూ కనికరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు.. కేటీపీపీ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతణ్ని ఆస్పత్రిలో చేర్పించిన అధికారులు.. మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. బిల్లు కట్టాలని ఆస్పత్రి నుంచి సమాచారం ఇచ్చినా, తమకు కట్టే స్తోమత లేదని బాధితుడి కుటుంబసభ్యులు వెళ్లి వేడుకున్నా స్పందించలేదు. బిల్లు కడితేనే పంపిస్తామని ఆస్పత్రి మేనేజ్ మెంట్ చెప్పడం, అధికారులేమో రాకపోవడంతో ఆవేదనకు గురైన బాధితుడు ఆస్పత్రిలోనే ఉరేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.  

కొడుకు మేజర్ అయినా జాబ్ ఇయ్యలె...

భూపాలపల్లి శివారు మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పల్లికి చెందిన మర్రి బాబు(50)కు భార్య లక్ష్మి, కూతురు లావణ్య, కొడుకు శ్రీకాంత్ ఉన్నారు. ఆయన 2006లో కేటీపీపీ మొదటి ఫేజ్​లో తనకున్న మూడెకరాల భూమిని కోల్పోయాడు. అధికారులు భూమి స్వాధీనం చేసుకున్న టైమ్ లో ఆయన కొడుకు మైనర్ కావడంతో ఉద్యోగం ఇవ్వలేదు. కనీసం బాబుకు ఉపాధి కూడా చూపలేదు. దీంతో ఆయన కుటుంబం నాలుగేండ్ల కింద రేగొండ మండలం పొనగల్లుకు వలస వెళ్లింది. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ బతుకుతోంది.  తనకు ఉపాధి చూపాలని 16 ఏండ్లు కేటీపీపీ అధికారుల చుట్టూ తిరిగిన బాబు.. ఆరేండ్ల క్రితం తన కొడుకు మేజర్ కావడంతో ఉద్యోగం ఇవ్వాలని ఆఫీసర్ల కాళ్లావేళ్లా పడ్డాడు. ఏండ్లకేండ్లు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులకు చెప్పినా కనికరించలేదు. ఓవైపు బిడ్డ పెండ్లికి ఎదగడం, మరోవైపు కొడుకుకు ఉద్యోగం లేకపోవడంతో బాబు మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 1న చెల్పూర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌లోని కేటీపీపీ గేటు ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కేటీపీపీ సెక్యూరిటీ సిబ్బంది బాబును భూపాలపల్లిలోని ఓ‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ట్రీట్ మెంట్ అందించి అతని ప్రాణాలు కాపాడారు. ఆయన పూర్తిగా కోలుకోవడంతో రెండు మూడు రోజుల కిందనే డిశ్చార్జి చేస్తామని చెప్పారు. ట్రీట్ మెంట్ కు రూ.60 వేల బిల్లు అయిందని, అది చెల్లించాలని తెలిపారు. అయితే తాము అంత కట్టలేమని, బిల్లు కేటీపీపీ ఆఫీసర్లే చెల్లిస్తారని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో ఆస్పత్రి మేనేజ్ మెంట్ కేటీపీపీ అధికారులకు సమాచారం ఇచ్చింది. అయినా ఎవరూ రాకపోవడంతో బాధితుడి కుటుంబసభ్యులు వెళ్లి వేడుకున్నారు. అయినప్పటికీ అధికారులెవరూ రాలేదు. బిల్లు కడితేనే పంపిస్తామని ఆస్పత్రి మేనేజ్ మెంట్ చెప్పింది. దీంతో ఇక అధికారులు రారని, ప్రాణాలకు తెగించినా తన కొడుకుకు ఉద్యోగం రాలేదనే ఆవేదనతో బాబు గురువారం ఉదయం ఆస్పత్రిలోనే ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. భూపాలపల్లి పోలీసులు ఆస్పత్రికి వచ్చి పరిశీలించారు. కుబుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.