
- మీ సేవలో డౌన్లోడ్ చేసుకోకుండా తొందరపాటు
- సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఘటన
జహీరాబాద్, వెలుగు: మీ సేవలో రెడీగా ఉన్న బర్త్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోకుండా, నెల రోజులైనా తన కొడుకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేయడం లేదని ఆవేశానికి లోనైన ఓ తండ్రి మంగళవారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తహసీల్దార్ దశరథ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతి బి గ్రామానికి చెందిన బోయిని శేఖర్ తన కొడుకు బర్త్ సర్టిఫికెట్ కోసం నెల రోజుల కింద మీ సేవలో అప్లై చేసుకున్నాడు. జూన్ 18న తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఆర్డీవో ఆఫీస్ కు రెఫర్ చేశారు. అక్కడ వెరిఫికేషన్ పూర్తి చేసి రెండు రోజుల తరువాత సర్టిఫికెట్ జారీ చేశారు.
మీ సేవలో సర్టిఫికెట్ తీసుకోకుండా, సర్టిఫికెట్ ఇష్యూ కాలేదని శేఖర్ మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, సిబ్బంది అతనిపై నీళ్లు పోసి కాపాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని శేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. మీసేవ నుంచి బర్త్ సర్టిఫికెట్ తెప్పించి అందజేశారు.