అప్పు కట్టాలి.. నా కొడుకును కొనుక్కోండి.. నడిరోడ్డుపై ఓ తండ్రి బేరం

అప్పు కట్టాలి.. నా కొడుకును కొనుక్కోండి.. నడిరోడ్డుపై ఓ తండ్రి బేరం

ఉత్తరప్రదేశ్‌లో హృదయవిదాకరమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పేగుల్ని మెలిపెట్టే ఘటన ఇది. డెలవప్ మెంటు జరుగుతున్న గొప్ప కంట్రీ అని చెప్పుకుంటున్న మనదేశంలో ఇలాంటి ఘటనలు కూడా ఇంకా జరుగుతున్నాయి. అప్పు తీర్చడం కోసం ఓ తండ్రి తన కొడుకును అమ్మాకానికి పెట్టిన ఘటన అందర్నీ తీవ్రంగా కలిచి వేస్తోంది.

అసలేం జరిగింది..? 

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి రాడ్‌వేస్ బస్టాండ్‌కు వెళ్లాడు. అక్కడ ఫుట్‌పాత్‌పై రోడ్ల పక్కన తన మెడలో ఒక బోర్డు పెట్టుకుని కుటుంబ సభ్యులతో కలిసి కూర్చున్నాడు. ఆయన మెడలోని బోర్డులో ఏముందంటే.. నా కొడుకు అమ్మకానికి ఉన్నాడు. నేను అతన్ని రూ.6 నుంచి రూ.8 లక్షలకు అమ్మాలనుకుంటున్నాను అని రాసి ఉంది. అప్పు తీర్చడం కోసం తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పాడు.

ఇది చూసిన కొంతమంది చలించిపోయారు. మరికొందరు తమ సెల్​ఫోన్లలో వీడియోను రికార్డు చేశారు. ఈ విషయం ఆనోట ఈ నోట అలీగఢ్​పోలీసుల వరకు చేరింది. ఇంకేముందు... పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. మెడలో బోర్డు పెట్టుకుని కూర్చున్న వ్యక్తి వద్దకు వచ్చిన పోలీసులు ఏంటని ఆరా తీశారు. ఏం కష్టం వచ్చింది..? కుమారుడిని ఎందుకు అమ్మాలనుకుంటున్నావు అని ఆరా తీశారు పోలీసులు. 

తన సమీప బంధువు వద్ద అప్పు తీసుకున్నానని, అయితే.. దాన్ని సకాలంలో కట్టకపోవడంతో తమ మధ్య గొడవలు జరిగాయని చెప్పాడు. త్వరగా తన అప్పు తీర్చాలంటూ తనను దుర్భాషలాడడంతో ఒత్తిడి పెరిగి.. ఏం చేయాలో తెలియక తన కుమారుడిని అమ్మాకానికి పెట్టానని పోలీసులకు చెప్పాడు. 

ఈ కేసును చాలా సీరియస్​గా తీసుకున్న పోలీసులు.. మానవతా ధృక్పథంలో సమస్యను పరిష్కరించారు. కుమారుడిని అమ్మకానికి పెట్టకుండా తండ్రిని అడ్డుకున్నారు. అంతేకాదు.. అప్పు ఇచ్చిన వ్యక్తి ఒత్తిడి చేయకుండా.. దుర్భాషలాడకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. 

ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తనదైన స్టైల్లో స్పందించారు. యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఏలుబడిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా తండ్రే కుమారుడిని అమ్మాకానికి పెట్టాడని, ఈ ఘటన రాష్ర్టంతో పాటు దేశ ప్రతిష్టను దిగజార్చకముందే రాష్ర్ట ప్రభుత్వం స్పందించాలని డిమాండ్​ చేశారు.