హాస్టల్​లో పాముకాటుతో స్టూడెంట్​ మృతి

హాస్టల్​లో పాముకాటుతో స్టూడెంట్​ మృతి
  • అయ్యో.. బిడ్డ!
  • హాస్టల్​లో పాముకాటుతో ఐదో తరగతి స్టూడెంట్​ మృతి
  • జ్వరంతో చనిపోయినట్లు నమ్మించేందుకు స్టాఫ్​ ప్రయత్నం
  • కామారెడ్డి జిల్లా బీర్కూర్ బీసీ బాయిస్​ హాస్టల్​లో ఘటన
  • హాస్టల్​ నిర్వహణ అధ్వానం.. చుట్టూ పొదలు, చెత్తా చెదారం
  • పిచ్చిమొక్కలు తొలగిస్తుండగా మహిళనూ కరిచిన పాము
  • భయంతో ఇంటి బాట పట్టిన విద్యార్థులు


బీర్కూర్/కామారెడ్డి , వెలుగు:  ప్రభుత్వ పట్టింపులేని తనం.. సిబ్బంది నిర్లక్ష్యం.. ఓ బిడ్డ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హాస్టల్​లో చదువుకుంటున్న పదేండ్ల బాలుడు పాముకాటుకు గురి కాగా..  సరైన టైమ్​లో సరైన ట్రీట్​మెంట్ అందించలేదు. వాంతులు చేసుకుంటున్నాడని నార్మల్​ ట్రీట్​మెంట్​ ఇప్పించి, నాలుగు గోలీలు వేసి  పడుకోబెట్టారు. తెల్లారి చూసే సరికి ఆ బిడ్డ కన్నుమూశాడు. జ్వరంతో చనిపోయాడని నమ్మించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్​ బీసీ వెల్ఫేర్​ బాయిస్​ హాస్టల్​లో జరిగింది. బాలుడు చనిపోయిన తర్వాత హాస్టల్​లో పిచ్చిమొక్కలను తొలగిస్తుండగా ఓ కార్మికురాలు కూడా పాముకాటుకు గురైంది. 

నేల మీదే నిద్ర

నస్రుల్లాబాద్​ మండలం దుర్కికి చెందిన గంగామణి, మురళి దంపతుల కొడుకు సాయిరాజ్​(10) బీర్కూర్​లోని బీసీ వెల్ఫేర్​ హాస్టల్​లో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే  శుక్రవారం రాత్రి అన్నం తిన్న తర్వాత మిగతా స్టూడెంట్స్​తో కలిసి రూమ్​లో సాయిరాజ్  నిద్రపోయాడు. హాస్టల్​లో మంచాలు లేకపోవడంతో విద్యార్థులంతా నేల మీదనే పడుకుంటున్నారు. రాత్రి అంతా నిద్రపోయాక సాయిరాజ్​ ఒక్కసారిగా వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు.

మిగతా విద్యార్థులు నిద్రలోంచి లేచి.. విషయాన్ని వర్కర్​కు చెప్పారు. లైట్లు వేసి చూడగా రూంలో పాము కనిపించింది. దాన్ని మిగతా స్టూడెంట్స్​ చంపేశారు. సాయిరాజ్​ వాంతులు చేసుకుంటున్న విషయాన్ని ఇన్​చార్జ్​ వార్డెన్ ఆర్​.సందీప్​కు వర్కర్​ చేరవేశాడు. అనంతరం ఆ బాలుడ్ని స్థానిక పీహెచ్​సీకి తీసుకెళ్లి వాంతులు అయినట్లు చెప్పాడు. అక్కడి సిబ్బంది వాంతులు తగ్గేందుకు టాబ్లెట్లు ఇచ్చి పంపారు. స్టూడెంట్​ను తిరిగి హాస్టల్​కు తీసుకొచ్చి పడుకొబెట్టారు. శనివారం తెల్లవారుజామున చూస్తే  సాయిరాజ్​లో ఎలాంటి కదలిక లేదు. మరోసారి ఈ విషయాన్ని వార్డెన్​కు చెప్పి అక్కడున్న వాళ్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సాయిరాజ్​ తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకోగా.. స్టూడెంట్​ చనిపోయినట్లు చెప్పారు. సాయిరాజ్​ జ్వరంతో వాంతులు చేసుకొని చనిపోయాడని సిబ్బంది నమ్మించే ప్రయత్నం చేశారు. 

చుట్టూ పొదలు, చెత్తాచెదారం

హాస్టల్​లో పాముకాటుతో విద్యార్థి చనిపోయిన ఘటన వెనుక ప్రభుత్వ పట్టింపులేని తనం, సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తున్నది. హాస్టల్​ చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయింది. పొదలు, పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. వీటి వల్ల హాస్టల్​ ఆవరణలో పాములు సంచరిస్తున్నాయి. కానీ, ఆవరణను క్లీన్​ చేయించే దిక్కు లేదు. బీర్కుర్​ బీసీ బాయిస్​ హాస్టల్​లో వార్డెన్​ పోస్టు ఖాళీ ఉండటంతో బోర్లాం హాస్టల్​ వార్డెన్​ సందీప్​కు ఇక్కడ ఇన్​చార్జీ బాధ్యతలు అప్పగించారు. విద్యార్థుల బాగోగులు చూసుకునేవాళ్లు లేరు. పాములు సంచరిస్తున్నా విద్యార్థులు నేలమీదనే పడుకోవాల్సిన దుస్థితి.

శుక్రవారం రాత్రి సాయిరాజ్​కు పాము కరువగా.. ఆ విషయాన్ని గుర్తించక, వాంతులు చేసుకున్నాడని చెప్పి నాలుగు గోలీలు వేయించి పడుకోబెట్టారు. హాస్టల్​ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరిగి పాములు సంచరిస్తున్న విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించకపోవడం, హాస్టల్​ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతోనే తమ కొడుకు చనిపోయాడని సాయిరాజ్​ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పాముకాటుతో చనిపోయినప్పటికీ జ్వరంతో చనిపోయినట్లు తమకు సిబ్బంది చెప్పారని మండిపడ్డారు. కాగా, పాముకాటుతో విద్యార్థి మృతిచెందిన విషయం తెలుసుకొని భయంతో మిగతా స్టూడెంట్ల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని.. వారిని  ఇండ్లకు తీసుకెళ్తున్నారు. 

వార్డెన్​ సస్పెన్షన్​

ఇన్​చార్జ్​ వార్డెన్​ సందీప్​ను సస్పెండ్​ చేస్తూ కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందున చర్య తీసుకున్నామన్నారు. స్టూడెంట్ చనిపోయిన ఘటనపై  ఎంక్వైరీ చేయించనున్నట్లు తెలిపారు.

నిర్లక్ష్యం వల్లే..:  సాయిరాజ్​ తల్లిదండ్రులు

‘‘హాస్టల్​లో స్టాఫ్​​, వార్డెన్​ నిర్లక్ష్యంతోనే మా కొడుకు చనిపోయిండు. పాము కాటు వేసినప్పటికీ .. ట్రీట్​మెంట్ ఇప్పించలేదు. పాము కరిచిన విషయాన్ని దాచి జ్వరం వచ్చినట్లు, వాంతులు చేసుకున్నట్లు చెప్పారు. ఆ అర్ధరాత్రే మాకు చెప్పి ఉంటే.. మేమన్నా ట్రీట్​మెంట్​ ఇప్పించేవాళ్లం. మా బిడ్డను ఎవరు తెచ్చిస్తరు?” అంటూ సాయిరాజ్​ తల్లిదండ్రులు గంగామణి, మురళి కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిని అసెంబ్లీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి ఫోన్​లో పరామర్శించారు.  ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

హాస్టల్​లోనే శానిటేషన్​ ... లేబర్​కు పాముకాటు

బీర్కుర్​ బీసీ బాయిస్​ హాస్టల్​లో పాముకాటుతో విద్యార్థి మృతి చెందిన తర్వాత.. పిచ్చి మొక్కలు తొలగించే పనులు చేపట్టారు. ఈ పనులు చేస్తుండగా.. శానిటేషన్​ లేబర్​ జ్యోతిని కూడా పాము కరిచింది. ఈమెను వెంటనే బాన్సువాడ ఏరియా హస్పిటల్​కు తరలించారు. ఇక్కడ ఆమె ట్రీట్​మెంట్​ పొందుతూ కొలుకుంటున్నది.