పటాకుల గోదాంలో అగ్ని ప్రమాదం.. 2కి.మీ.మేర వ్యాపించిన పొగలు

పటాకుల గోదాంలో అగ్ని ప్రమాదం.. 2కి.మీ.మేర వ్యాపించిన పొగలు

మైసూరులోని ఓ బాణసంచా దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 2 కి.మీ మేర పొగలు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హుబ్లీ ఇండస్ట్రియల్ పార్క్‌లోని ఓ  ప్రైవేట్ క్రాకర్ ఫ్యాక్టరీ   గోడౌన్‌లో కోట్లాది రూపాయల విలువైన క్రాకర్లు నిల్వ ఉంచారు. ఈ క్రమంలో గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అంతటా వ్యాప్తించాయి. చుట్టుపక్కల ఉన్న 50కి పైగా భవనాలు మంటల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ గోడౌన్‌లో ఎంత మంది పనిచేస్తున్నారో, సమీపంలోని భవనాల నుండి ఎంత మంది ప్రభావితమయ్యారో అధికారులు ఇంకా వెల్లడించలేదు.

మైసూరు నగరానికి చెందిన దాదాపు 14 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పడంలో చురుకుగా పాల్గొంటున్నాయి. భవనంలో పలువురు చిక్కుకుపోయి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మంటలను ఆర్పడానికి మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గోడౌన్‌లోని పటాకులు పూర్తిగా పేలడంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర పొగలు అలుముకున్నాయి. దీంతో ప్రమాద ప్రాంతం చుట్టూ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

పేలుడు ధాటికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వరకు ప్రభావితం అయినట్టు సమాచారం. ప్రమాద తీవ్రత ఆ మేరకు ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి మంటలకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.