గోవాలో రక్త చరిత్ర..ఢిల్లీ కుటుంబంపై కత్తులతో దాడి

గోవాలో రక్త చరిత్ర..ఢిల్లీ కుటుంబంపై కత్తులతో దాడి

గోవాలో దారుణం జరిగింది. గోవా టూర్కు వచ్చిన ఢిల్లీ కుటుంబంపై అక్కడి దుండగుల ముఠా  కత్తులు, బ్యాట్లతో దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు.  అంజునా ప్రాంతంలోని స్పాజియో లీజర్ రిసార్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.  దుండగుల దాడిలో పలువురు గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


 
ఢిల్లీకి చెందిన 47 ఏళ్ల అశ్విని కుమార్ చంద్రాని తన కుటుంబంతో కలిసి మార్చి 5న గోవాకు  వెళ్లాడు. అంజునా ఏరియాలోని స్పాజియో లీజర్ రిసార్ట్‌లో వీరంతా  బస చేశారు.  రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే రోషన్‌, అశ్విని కుమార్  మధ్య  స్వల్ప వాగ్వాదం జరిగింది. అశ్విన్ కుమార్ రిసార్ట్ మేనేజర్‌కు కంప్లెయింట్ ఇచ్చాడు. రిసార్ట్ మేనేజర్ రోషన్‌ను పని నుంచి తొలగించాడు. దీంతో కోపం పెంచుకున్న  రోషన్‌.. తన అనుచరులను రిసార్ట్‌ వద్దకు పిలిపించుకున్నాడు. వారు  బ్యాట్లు, కత్తులతో వచ్చి .. అశ్విని కుమార్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు.ఈ దాడిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై  బాధిత ఢిల్లీ కుటుంబం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారు పోలీస్‌ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. 

స్పందించిన సీఎం

రిసార్ట్‌లోని సీసీటీవీలో దాడికి సంబంధించిన  వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో  గోవా సీఎం ప్రమోద్ సావంత్  స్పందించారు. ఈ సంఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దాడి ఘటన సహించరానిదన్నారు.  ఇలాంటి  సంఘ విద్రోహులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్‌లో హామీ ఇచ్చారు. 

కేసు నమోదు..

ఢిల్లీ కుటుంబంపై దాడి ఘటనపై గోవా పోలీస్‌ ఉన్నతాధికారులు నిందితుడు రోషన్‌, అతడి అనుచరులు నైరాన్ రెజినాల్డో డయాస్, జోసెఫ్ అలెక్స్ లోబో, కాశీనాథ్ విశ్వోర్ అగర్కడేకేలను అదుపులోకి తీసుకున్నారు.  దాడికి సహకరించిన మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన అంజునా ప్రాంత పోలీస్‌ స్టేషన్‌ అధికారిపై  చర్యలు తీసుకుంటామని చెప్పారు.