యూట్యూబ్​లో చూసి రూ.500 నోట్ల ప్రింటింగ్

యూట్యూబ్​లో చూసి రూ.500 నోట్ల ప్రింటింగ్

హైదరాబాద్‌‌, వెలుగు : పాతబస్తీలో దొంగ నోట్ల ముఠా పట్టుబడింది. నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాలో ఇద్దరిని సౌత్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.  వీరి వద్ద రూ.27 లక్షలు విలువ చేసే రూ.500 ఫేక్‌‌‌‌‌‌ నోట్లను, కలర్‌‌‌‌ ప్రింటర్, ల్యాప్‌‌టాప్‌‌, కలర్‌‌‌‌ కెమికల్ బాటిల్స్‌‌ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ గ్యాంగ్‌‌ వివరాలను క్రైమ్స్‌‌ డీసీపీ శబరీష్ వెల్లడించారు. నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన కస్తూరి రమేష్ బాబు(35) కారు మెకానిక్‌‌గా పని చేసేవాడు. లాక్ డౌన్‌‌లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈజీ మనీ కోసం ప్లాన్ చేశాడు. ఫేక్ కరెన్సీ తయారీపై యూట్యూబ్‌‌లో సెర్చ్‌‌ చేశాడు.  ఇందుకు అవసరమైన పేపర్‌‌‌‌, కలర్స్, ప్రింటర్‌‌‌‌ కొన్నాడు.  రూ.2 వేలు, రూ.500 నోట్లను ప్రింట్‌‌ చేయడం ప్రారంభించాడు. వీటిని హోల్‌‌సేల్​, రిటైల్ మార్కెట్లలో ఏజెంట్లకు కమీషన్‌‌ బేసిస్‌‌లో అమ్మేవాడు. గతేడాది సెప్టెంబర్‌‌‌‌లో గోపాలపురం పోలీసులకు చిక్కాడు. రమేష్ బాబును పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌‌గూడ జైలులో రిమాండ్‌‌కి తరలించారు.

తాండూరుకు మకాం మార్చి..

రమేష్‌‌బాబు జైలులో ఉన్న టైమ్ లో  ఫలక్‌‌నుమాకు చెందిన పాత నేరస్తుడు హసన్ బిన్ హమూద్‌‌(31)తో పరిచయం ఏర్పడింది. బహదూర్‌‌‌‌పురాలో జరిగిన హత్య కేసుతో పాటు మరో నాలుగు కేసుల్లో హసన్ బిన్ హమూద్‌‌ నిందితుడిగా ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఫేక్ కరెన్సీ గురించి చర్చించారు. ఓల్డ్‌‌సిటీలో సులువుగా ఫేక్​ కరెన్సీ చలామణి చేయొచ్చని ప్లాన్ చేశారు. డిసెంబర్‌‌‌‌లో ఇద్దరూ జైలు నుంచి రిలీజ్‌‌ ఆయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రమేష్‌‌బాబు తన సోదరి రామేశ్వరి(32)తో కలిసి తాండూరుకు మకాం మార్చాడు. పోలీసుల కంట పడకుండా నకిలీ కరెన్సీ నోట్లను ప్రింట్‌‌ చేశారు. రూ.లక్ష విలువ చేసే రూ.500నోట్లను ప్రింట్‌‌ చేశారు. వీటిని గుజరాత్‌‌ కు తరలించి చలామణి చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఈ ఏడాది జనవరిలో అక్కడి పోలీసులు అరెస్ట్‌‌ చేశారు.

చాంద్రాయణగుట్టలో ప్రింటింగ్‌‌ చేస్తూ..

ఓ వైపు రమేష్​ బాబు గుజరాత్​ జైలులో ఉండగా.. మరోవైపు అతడి సోదరి రామేశ్వరి, హసన్ బిన్ హమూద్‌‌తో కలిసి చాంద్రాయణగుట్ట అడ్డాగా ఫేక్‌‌ నోట్లు ప్రింట్‌‌ చేసేందుకు ప్లాన్ చేసింది. గుజరాత్‌‌లోని పాత కస్టమర్లతో పాటు ఓల్డ్‌‌సిటీలోని ఏజెంట్లకు కమీషన్ బేసిస్‌‌పై ఫేక్​నోట్లు సప్లయ్ చేసేవారు. సమాచారం అందుకున్న  సౌత్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు హసన్ బిన్ హమూద్‌‌పై నిఘా పెట్టారు.ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్‌‌ఐ నరేందర్‌‌ సహా టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు‌‌ చాంద్రాయణగుట్టలో దాడులు చేశారు. హసన్ బిన్ హమూద్‌‌, రామేశ్వరిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు.