గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థిని మృతి

 గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థిని మృతి

గుండెపోటు.. ఈ మధ్య చాలామందికి వస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువకులకు ఎక్కువగా గుండెపోటు వస్తోంది. ఇది ఎప్పుడు ఎవరిని బలితీసుకుంటుందో తెలియడం లేదు. ఒకప్పుడు వయసు మీద పడ్డ వారికి మాత్రమే గుండెజబ్బులు, గుండెపోటు వచ్చేది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థిని మృతిచెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. 

నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అదరంగి మైథిలి(12) అనే విద్యార్థిని ఏడో తరగతి చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. వచ్చిన రోజే గుండెపోటుతో మృతి చెందింది. 

కంజర గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు సాయిలక్ష్మికి గ్రెసీ, మైథిలి ఇద్దరు కుమార్తెలు. సాంఘిక సంక్షేమ గురుకులంలోనే గ్రెసీ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, మైథిలి ఏడో తరగతి చదువుతున్నారు. దసరా సెలవు కావడంతో శుక్రవారం (అక్టోబర్ 13న) ఇంటికి వచ్చింది. సాయంత్రం వరకు హుషారుగా కనిపించిన బాలిక రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వస్తుందని తల్లికి చెప్పడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే..  అప్పటికే గుండెపోటుతో విద్యార్థిని చనిపోయిందని వైద్యుడు తెలిపారు. శనివారం (అక్టోబర్ 14న) గ్రామంలో బాలిక అంత్యక్రియలు నిర్వహించారు. తోటి విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు మైథిలికి కన్నీటి వీడ్కోలు పలికారు.