పిలగాండ్లు గుణపాఠం

పిలగాండ్లు గుణపాఠం

‘‘అడవిలోని జంతువులన్నీ ఈ రోజు మధ్యాహ్నం తాను నిర్వహించే సమావేశంలో పాల్గొనాలని మృగరాజు సింగన్న చెప్పాడు. కాబట్టి అందరూ రావాలి” అని నక్క బావ చెప్పింది. అది విని జంతువులన్నీ సమావేశానికి హాజరయ్యాయి. ‘‘ఈ హడావుడి సమావేశం దేనికో చెప్పండి మహారాజా!’’ అని అడిగాయి.వాటి ప్రశ్నకు మృగరాజు సింగన్న సమాధానం చెప్తూ ‘‘మిత్రులారా! అడవిలో ఉంటున్న మనకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు మనిషి. అడవులను నరికేస్తూ, ఇండ్లు కట్టుకొని తాను సంతోషంగా ఉంటున్నాడు. ఫలితంగా మనకు తినడానికి తిండి దూరమైంది. కాయలు, పండ్లు దొరకడం లేదు. కాబట్టి మనమంతా మనుషుల ఇండ్లలోకి వెళ్లి, వాళ్ల ఇళ్లలో దొరికిన పదార్థాలను రోజూ తినేద్దాం. ఇలా చేస్తే మనిషికి చక్కటి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. వాళ్లు మన సమస్య పరిష్కరిస్తారు. ఏమంటారు?’’ అని మృగరాజు సింగన్న అడిగాడు.

వెంటనే జంతువులన్నీ ముక్తకంఠంతో.. ‘‘మీ ఆలోచన చాలా బాగుంది. మనం రోజూ కడుపు నిండా తినలేని పరిస్థితిని మనిషి తెచ్చాడు. మీరు చెప్పినట్టు ఇండ్లల్లోకి వెళ్లి దొరికిన పదార్థాలన్నీ తినేద్దాం’’ అన్నాయి. దాంతో మృగరాజు చాలా సంతోషపడ్డాడు. ‘‘రేపటి నుండి మనం అనుకున్న పని మొదలుపెడదాం’’ అని సమావేశం  ముగించాడు.

అనుకున్నట్టే జంతువులన్నీ ఇండ్లల్లోకి రావడం, వస్తువులను చిందర వందర చేయడం, వండిన పదార్థాలు తినడం, దొరికిన పండ్లు, కాయలతో  ఆకలి తీర్చుకోవడం.. రోజూ ఇదే తంతు. ఇది చూసిన ప్రజలంతా ‘ఇలా ఎందుకు జరుగుతుంది?’ అని ఆలోచించి మూకుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నారు.

జంతువులు ఉండాల్సిన ప్రదేశంలో మనం ఇండ్లు కట్టుకున్నాం. కాబట్టి వాటికి ఆహార కొరత ఏర్పడింది. మనమంతా ఊరు చివర పండ్ల తోటలు పెంచుదాం అని నిర్ణయించుకున్నారు. అలా ఆరు నెలల కాలంలోనే పండ్లు, కాయలతో కళకళలాడే వనాన్ని పెంచారు. అప్పట్నించి జంతువులు రావడం మానేశాయి. తమ పథకం పారినందుకు, మనిషి మారినందుకు అవి సంతోషించాయి.

- కె. రేవతి, 10వ తరగతి