రాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకం కాదు:ఉండవల్లి అరుణ్ కుమార్

రాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకం కాదు:ఉండవల్లి అరుణ్ కుమార్

సుప్రీంకోర్టులో విభజన హామీలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. దీనిపై  జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పార్టీ ఇన్ పర్సన్ గా పిటిషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపించారు . తాను ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిందని..విభజన చట్టాన్ని ఆమోదించే  ప్రక్రియ సరిగా లేదన్నారు. పార్లమెంట్ లో లైవ్ టెలికాస్ట్ ఆపేశారని.. రూల్ బుక్ అమలు చేయలేదని కోర్టుకు విన్నవించారు. 

డివిజన్ కోసం అడిగినా సరే ఓటింగ్ చేపట్టలేదని ఉండవల్లి అన్నారు. 86 మంది మైక్ ద్వారా తమ అభిప్రాయాలు చెప్పారని..మిగతావారు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలు చెప్పారన్నారు. విభజన చట్టంలో ఇవేవీ ప్రస్తావించనేలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంటు చరిత్రలో ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. బీహార్, జార్ఖండ్ విభజన సమయంలో ఏకాభిప్రాయం సాధించారన్నారు. 

గతంలో ఒక కమిషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అని..రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉందన్నారు. తాను విభజనకు వ్యతిరేకం అని ఎక్కడా చెప్పలేదన్నారు. నిబంధనల ప్రకారం విభజన ప్రక్రియ జరగలేదన్నదే తన అభ్యంతరమని కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణను 2023 ఫిబ్రవరి 22కి వాయిదా వేసింది న్యాయస్థానం.