హైదరాబాద్లో నీటి కొరత ఉండదు ..ఇంటికో ఇంకుడు గుంత- .. 90 రోజుల యాక్షన్ ప్లాన్

 హైదరాబాద్లో నీటి కొరత ఉండదు ..ఇంటికో ఇంకుడు గుంత- ..  90 రోజుల యాక్షన్ ప్లాన్
  • సీఎం ఆదేశంతో  ప్రణాళిక రూపొందిస్తున్న మెట్రో వాటర్​ బోర్డు
  • 90 రోజుల్లో 16 వేల ఇంకుడు గుంతలను నిర్మించాలని నిర్ణయం

హైదరాబాద్​సిటీ, వెలుగు:  గ్రేటర్​ పరిధిలో డ్రైనేజీ పూడికలపై 90 రోజుల ప్రణాళికను సక్సెస్​ చేసిన మెట్రోవాటర్​బోర్డు.. తాజాగా ఇంటికో ఇంకుడు గుంత పేరుతో 90 రోజుల యాక్షన్ ​ప్లాన్​కు సిద్ధం అవుతోంది. సీఎం రేవంత్​రెడ్డి  ఆదేశాలతో అధికారులు గ్రేటర్​ పరిధిలో, ముఖ్యంగా వెస్ట్ సిటీపై దృష్టిపెడుతున్నారు. ఇంకుడు గుంతల ప్రాధాన్యం, వాటి నిర్మాణ ఆవశ్యకతను తెలియజేసేందుకు బోర్డు అధికారులు  90 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇంటికో ఇంకుడు గుంత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ కలిసి అధికారులు, ఎన్జీవోలతో శుక్రవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. ఓఆర్ ఆర్ పరిధిలో భూగర్భ జలాలను పెంచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో 90 రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించామని, ఈ ప్లాన్ లో భాగంగా రానున్న 90 రోజుల్లో 16 వేల ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

నీటి సమస్య తలెత్తకుండా..

 అధికారులు, ఎన్జీవోలు క్షేత్రస్థాయిలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టే అనువైన ప్రాంతాలను వారంలోగా గుర్తించనున్నారు. అలాగే అపార్టుమెంట్లు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీ వాసులకు ఇంకుడుగుంతల ప్రాధాన్యతను తెలిపేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. వీటితో పాటు నిరుపయోగంగా ఉన్న బోర్ వెల్ లను గుర్తించి ఇంజక్షన్ బోర్ వెల్ గా మార్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

 వేసవిలో భూగర్భ జలాలు పడిపోయి, తాగునీటితో పాటు గృహావసరాలకు సైతం అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే పరిస్థితి తలెత్తింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఇంటికో ఇంకుడు గుంత నినాదంతో అధికారులు కార్యచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్​ ఆపరేషన్​–1 అమరేందర్​రెడ్డి,  డైరెక్టర్ ఆపరేషన్-–2 వీఎల్ ప్రవీణ్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్, సీజీఎంలు, ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి జాల సత్యనారాయణ, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.