చౌటుప్పల్​లో డంప్ స్వాధీనం

చౌటుప్పల్​లో డంప్ స్వాధీనం
  • రూ.కోటికిపైగా నకిలీ లిక్కర్ సీజ్
  • చౌటుప్పల్​లో డంప్ స్వాధీనం 
  • ఒడిశా, కర్నాటక నుంచి తెప్పించి  వైన్ షాపుల్లో అమ్మకం 
  • లిక్కర్ వ్యాపారి ఒకరు అదుపులోకి..  పరారీలో మరొకరు

ఎల్ బీనగర్, వెలుగు: సిటీ శివారులో భారీగా నకిలీ లిక్కర్ దొరికింది. ఇబ్రహీంపట్నంలో తీగ లాగితే హయత్ నగర్ బంజారా కాలనీ మీదుగా చౌటుప్పల్ లోని దేవలమ్మ నాగారంలో డొంక కదిలింది. ఇబ్రహీంపట్నం నుండి వచ్చిన చిన్న ఫిర్యాదుతో వైన్ షాపులపై ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు జరిపారు. భారీగా నకిలీ మద్యాన్ని గుర్తించారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో బాలరాజు గౌడ్, కొండల్ రెడ్డి అనే ఇద్దరు లిక్కర్ వ్యాపారులకు చెందిన డంప్ లో రూ. కోటికి పైగా విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో బాలరాజ్ గౌడ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

నకిలీ మద్యాన్ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండలో జిల్లాల్లో బాలరాజు గౌడ్, కొండల్ రెడ్డికి చెందిన కొన్ని వైన్ షాప్ లు ఉన్నాయి. వీరిద్దరికి చెందిన వైన్ షాపుల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మునుగోడు ఎలెక్షన్ లో కూడా ఇదే మద్యాన్ని సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ మద్యాన్ని తెచ్చి చౌటుప్పల్ లో భారీగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ నకిలీ మద్యాన్ని ఒడిశా, కర్నాటక నుండి దిగుమతి చేసుకుంటూ, తమ వైన్ షాపుల ద్వారా అమ్మిస్తున్నట్లు తెలిసింది. కొండల్ రెడ్డి పరారీలో ఉండగా, బాలరాజ్ ను దర్యాప్తు కోసం ఒడిశాకు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఇబ్రహీంపట్నంలోని బెల్ట్ షాప్ కు చెందిన కొందరిని అరెస్ట్ చేయగా, మరికొందరి కోసం గాలిస్తున్నారు.