
- ఒక్కో ఆటోపై లక్ష వరకు అదనపు వసూళ్లు
- బినామీ పేర్లతో బుక్ చేస్తున్న కొందరు డీలర్లు
- ప్రభుత్వ లక్ష్యానికి గండి కొడుతున్న డీలర్లు, ఆటో ఫైనాన్షియర్లు
- ఆటోల పర్మిట్ల పేరిట దందా
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో కొత్త ఆటోల పర్మిట్ల జారీలో భారీ కుంభకోణం చోటు చేసుకుంటోంది. కొందరు డీలర్లు, ఆటో ఫైనాన్షియర్లు కుమ్మక్కై దోచుకుంటున్నారు. ఎక్కువ ధర చెల్లిస్తేనే ఆటోలు ఇస్తామని డీలర్లు బహిరంగంగానే చెప్తున్నారని ఆట్రో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఆటోల అసలు ధరపై రూ.లక్ష వరకు అధికంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
23 ఏండ్ల తర్వాత...
దాదాపు 23 ఏండ్ల పాటు గ్రేటర్ పరిధిలో ఆటోలపై నిషేధం ఉంది. దీన్ని తొలగించాలని వస్తున్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని, నిరుద్యోగులకు ఆటోల ద్వారానైనా ఉపాధి కల్పించాలని కాంగ్రెస్ప్రభుత్వం ఔటర్ రింగ్‌రోడ్ పరిధిలోని ప్రాంతాల్లో కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ పరిధిలో 20 వేల ఎలక్ట్రిక్ఆటోలు, 10 వేల సీఎన్జీ, మరో 10 వేలు ఎల్పీజీ కలిపి 40 వేల ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే జీవో కూడా విడుదల చేసింది.
ఇదీ ప్రాసెస్..
ఆటోల పర్మిట్లు ఇవ్వడానికి ఆర్టీఏ అధికారులు ఆన్‌లైన్‌ద్వారా అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అయితే, దరఖాస్తులను డీలర్ల ద్వారానే పంపాలని, సంబంధిత వ్యక్తికి ఆటో డ్రైవింగ్లైసెన్స్, ఆధార్‌కార్డు ఉండి ఇప్పటి వరకూ ఆటో కలిగి ఉండని వారికి మాత్రమే ఇవ్వాలని రూల్స్‌లో పొందుపరిచారు. ఆటో కావాలనుకునే వారు డీలర్ల వద్దకే వెళ్లి బుక్‌చేసుకోవాల్సి ఉంటుంది. డీలర్ల నుంచి వచ్చే దరఖాస్తులకు ఆర్టీఏ అధికారులు అప్రూవల్స్ ఇస్తారు. తర్వాత డబ్బు కడితే డీలర్లు కొత్త ఆటో డెలివరీ చేయాలి.
ఏం జరుగుతోందంటే..
అయితే, రూల్స్‌కు విరుద్ధంగా కొంతమంది డీలర్లు, ఆటో ఫైనాన్షియర్లు కుమ్మక్కై అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. సాధారణంగా సీఎన్జీ, ఎల్పీజీ ఆటోల ధర రూ.2.35 లక్షల నుంచి రూ.2.45 లక్షల వరకు ఉంటుంది. కానీ, డీలర్లు రూ.3.10 లక్షల నుంచి రూ.3.20 లక్షలకు అమ్ముతున్నారని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఆటో కొన్న తర్వాత బిల్లు మాత్రం రూ.2.35 లక్షలకే ఇస్తున్నారని చెప్తున్నారు.
ముందే బుకింగ్..
కొందరు డీలర్లు తమకు తెలిసిన ఆటో డ్రైవర్ల ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ సేకరించి ముందే బుక్ చేసి పెట్టుకుంటున్నారు. ఎవరైనా ఆటో కావాలని వస్తే ఇష్టమున్నంత ధరలు చెప్పి డీల్కుదుర్చుకుని అమ్ముకుంటున్నారు. ఇలా గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు దాదాపు రూ. 50 కోట్ల వరకు చేతులు మారినట్టు సమాచారం. ఈ అక్రమ దందాకు కొందరు ఆర్టీఏ అధికారులు సైతం సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
స్టాక్ లేదని దండుకుంటూ...
సీఎన్ జీ, ఎల్పీజీ ఆటోలతో పోలిస్తే ఎలక్ట్రిక్ఆటోల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే, డీలర్లు ఎక్కువ డబ్బు దండుకునేందుకు ఆటో డ్రైవర్లకు ముందుగా ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలే అమ్ముతున్నారు. ఆటో కావాలనుకున్న వారు డీలర్‌వద్దకు వెళ్తే స్టాక్ లేదని చెప్తున్నారు. అదనంగా చెల్లిస్తామని చెప్తే అప్పుడు ఎలక్ట్రిక్ఆటోలను ఇస్తున్నారు.
ఎలక్ట్రికల్ ఆటోలు అమ్మడం లేదు
డీలర్లు సీఎన్జీ, ఎల్పీజీ తప్ప ఎలక్ట్రికల్ ఆటోలు అమ్మడం లేదు. బినామీ పేర్లతో షోరూం యజమానులు ఆటోలు బుక్‌చేస్తున్నారు. బ్లాక్ లో ఆటో పర్మిట్లను అమ్ముకుంటున్నారు. షోరూం యజమానులు, ఆటో డీలర్, ఫైనాన్షియర్లు కుమ్మక్కై వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు. ఆటో అమ్మకాలపై ప్రభుత్వం విచారణ జరపాలి. అక్రమాలకు పాల్పడే వారిపై యాక్షన్తీసుకోవాలి.
– ఎ.రవిశంకర్, ప్రధాన కార్యదర్శి, అనుబంధ భారతీయ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ సంఘ్