ఇంత పెద్ద రాయి భూమిని ఢీకొంటే.. నాసా ఆందోళన ఎందుకంటే..

ఇంత పెద్ద రాయి భూమిని ఢీకొంటే.. నాసా ఆందోళన ఎందుకంటే..

అంతరిక్షంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. ముఖ్యంగా గ్రహశకలాలు వల్ల ఏర్పడే పరిణామాలు కొన్ని మరింత ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. అందులోనూ కొన్ని గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చి.. సూర్యుడి చుట్టూ రౌండ్ కొట్టి... మళ్లి వెళ్లిపోతూ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన ప్రమాదం ఇప్పటివరకూ జరగలేదు. కానీ అలా కాకుండా ఏదైనా గ్రహశకలం భూమిని ఢీకొంటే... భూకంపం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఢీకొట్టకుండా... భూమిని తాకుతూ వెళ్లినా... విపరీతమైన నష్టాలను చూడాల్సి వస్తుంది.

ది సన్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, ఈ నెలాఖరులో 656 అడుగుల వెడల్పు గల ఓ రాయి భూమికి అతి దగ్గరగా వెళుతుందని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తెలియజేసింది. ఈ అంతరిక్ష శిలకి 2023 CL3 అని పేరు కూడా పెట్టారు. ఈ నివేదిక ప్రకారం, ఈ రాయి భూమికి సమీపంగా వస్తున్నట్టు నాసా వెల్లడించింది. ప్రమాద పరిణామాలను ముందే కనిపెట్టిన నాసా.. ఈ స్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ రాయిని నాసా అత్యంత ప్రమాదకరమైనదిగా అభివర్ణించింది. అయితే దీని వల్ల ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. గంటకు 25 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు కదులుతున్న ఈ రాయి.. మే 24న భూమికి అతి సమీపంగా రానున్నట్టు సమాచారం. ఆ సమయంలో రాయికి, భూమికి మధ్య దూరం 72 లక్షల కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఇది చాలా దూరం. కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. అయితే అంతరిక్షంలోకి వెళ్లే సరికి అది తక్కువ దూరంగా పరిగణించబడుతుంది. ఈ రాయి భూమిని తాకనందున ప్రమాదమేమీ లేనట్టుగా అధికారులు చెబుతున్నారు. కానీ అంతరిక్షంలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని నాసా నమ్ముతున్నందున.. కాస్త ఆందోళన వ్యక్తం అవుతోంది.

 ప్రస్తుతం ఈ రాయిని చూసి భయపడాల్సిన పని లేదని, అయితే ఇంత వేగంతో ఇంత పెద్ద రాయి భూమిని సరిగ్గా ఢీకొంటే మనుషులపై పెను సంక్షోభం వచ్చి ఉండేదని నాసా అంచనా వేసింది. ఇంత పెద్ద రాళ్లతో భూమి యుద్ధానికి ఇంకా సిద్ధంగా లేదని పలువురు నిపుణులు అంటున్నారు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే భూమిని కాపాడడం కష్టతరంగా మారుతుంది. అందుకే భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి రాళ్లు భూమిని తాకితే వాటిని నివారించే విధంగా రక్షణ యంత్రాంగాన్ని సిద్ధం చేయడంలో నాసా నిమగ్నమై ఉంది.