తమ్ముడి పేరుతో అన్న ఉద్యోగం

తమ్ముడి పేరుతో అన్న ఉద్యోగం

ట్రాన్స్ కోలో 12 ఏండ్లుగా..

తమ్ముడి కంప్లైంట్ తో చీటింగ్ కేసు

గోదావరిఖని, వెలుగు: వారిద్దరు అన్నదమ్ములు . రూపురేఖల్లో ఒకే రకంగా ఉన్నారు. దీంతో తమ్ముడి పేరుతో ఎవరికి అనుమానం రాకుండా 12 ఏండ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. తమ్ముడు విజిలెన్స్‌‌‌‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చంద్రశేఖర్‌‌‌‌ నగర్‌‌‌‌కు చెందిన గాదె రవీందర్‌‌‌‌, రాందాస్‌‌‌‌ అన్నదమ్ములు. రవీందర్‌‌‌‌ పదో తరగతి వరకు చదువుకుని కమాన్‌‌‌‌పూర్‌‌‌‌లో డిష్‌‌‌‌ నిర్వహించేవాడు. తమ్ముడు రాందాస్‌‌‌‌ ఐటీఐ ఎలక్ట్రీషియన్‌‌‌‌ పూర్తి చేశాడు. వారి సమీప బంధువు ఒకరు సబ్‌ స్టేషన్ల నిర్మాణం కాంట్రాక్టు పనులు చేపట్టడంతో ఆయన ద్వారా ట్రాన్స్‌‌‌‌కోలో ఉద్యోగావకాశాలు పొందవచ్చని రవీందర్‌‌‌‌ తమ్ముడితో అన్నాడు . దీంతో 2008లో రాందాస్ తన ఐటీఐ సర్టిఫికెట్లతో పాటు రూ.లక్ష నగదు అన్నకు ఇచ్చాడు . రవీందర్‌‌‌‌ తమ్ముడి సర్టిఫికెట్ల ఆధారంగా కాంట్రాక్టు పద్ధతిలో మంథని డివిజన్‌‌‌‌లోని వెంకటాపూర్‌‌‌‌ సబ్‌ స్టే షన్‌‌‌‌లో ఉద్యోగం పొందాడు.

ఉద్యోగం రాకపోవడంతో తన సర్టిఫికెట్లను, డబ్బును ఇవ్వాలని రాందాస్ అడిగిన ప్రతిసారి రవీందర్ దాటవేసేవాడు. చివరకు 2014లో గోదావరిఖని వన్‌‌‌‌టౌన్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టే షన్‌‌‌‌లో సోదరుడిపై రాందాస్‌‌‌‌ ఫిర్యాదు చేసినా సమస్య తేలలేదు. ఈలోపు అంతర్గతంగా పడిన జూనియర్‌‌‌‌ లైన్‌‌‌‌మెన్‌‌‌‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఆ ఉద్యోగాన్ని సంపాదించాడు. రెండుసార్లు ప్రమోషన్​పొంది ప్రస్తుతం గోదావరిఖని ఈస్ట్‌‌‌‌ డివిజన్‌‌‌‌లో లైన్‌‌‌‌మెన్‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌గా డ్యూటీ చేస్తున్నాడు . చివరకు రాందాస్‌‌‌‌ సమాచార హక్కు చట్టం కింద వివరాలు తీసుకుని హన్మకొండలోని ట్రాన్స్‌‌‌‌కో సెంట్రల్‌‌‌‌ విజిలెన్స్‌‌‌‌ విభాగానికి ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన ఆఫీసర్లు రవీందర్‌‌‌‌ను ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించారు. ట్రాన్స్‌‌‌‌కో మంథని డివిజనల్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌ పెందోట తిరుపతి శుక్రవారం గోదావరిఖని వన్‌‌‌‌టౌన్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టే షన్‌‌‌‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రవీందర్ పై చీటింగ్‌‌‌‌ కేసు నమోదు చేశారు.