
హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో ఆదివారం పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణమ్మ అందాలు చూస్తూ సెల్ఫీలు దిగుతూ, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపారు. తెలంగాణతో పాటు ఏపీ నుంచి వచ్చిన పర్యాటకుల వాహనాలతో సాగర్ శివాలయ ఘాట్ నుంచి రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పర్యాటకుల తాకిడి పెరగడంతో ట్రాఫిక్‌ను నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
మరో వైపు నాగార్జున సాగర్‌కు శ్రీశైలం నుంచి 3,89,692 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 26 క్రస్ట్ గేట్లను10 ఫీట్ల మేర ఎత్తి 3,63,714 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు (312. 0450 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 585 అడుగుల (297.40 టీఎంసీల) నీరు ఉంది. సాగర్ నుంచి ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 33,454 క్యూసెక్కులు, కుడికాల్వకు 9,019, ఎడమకాల్వకు 7,518, ఏఎమ్మార్పీ కి 2,400, ఎల్‌ఎల్‌సీకి 300 చొప్పున మొత్తం 4,16,405 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.