తల్లికి కొడుకు.. అక్కకు తమ్ముడు.. చెల్లికి అన్న.. భార్యకు భర్త.. బిడ్డకు తండ్రి.. ఓ మంచి స్నేహితుడు...కానీ, దేశం కోసం ఈ బంధాలన్నింటినీ వదిలి వెళ్తారు జవాన్లు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా దేశం కోసం రేయింబవళ్లు పనిచేస్తుంటారు. దేశ రక్షణలోనే కాదు భూకంపాలు, ప్రళయాల వంటి ఏ ఆపద వచ్చినా ముందుంటున్న వీళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి సైన్యంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్‌కి చెందిన 650 మంది వివిధ హోదాల్లో ఉన్నారు.
కాగజ్ నగర్ డివిజన్లోని బెంగాలీ క్యాంప్‌ల నుంచి పెద్ద ఎత్తున యువత ఆర్మీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వీరంతా శరణార్థులుగా1964లో అప్పటి సర్కార్ చొరవతో ఇక్కడ ఊర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఒక్కో ఊరు పెరుగుతూ ఈస్ గాం, నజ్రుల్ నగర్, బసంత్ నగర్, రాంనగర్‌తో పాటు రవీంద్ర నగర్1, 2 ఇలా మొత్తం15 బెంగాలీ క్యాంప్‌లు(ఊర్లు) ఏర్పాటయ్యాయి. అయితే పదో క్లాస్ పూర్తవ్వగానే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ మీద దృష్టి పెట్టి ఆర్మీలో చేరతారు ఇక్కడి యువత. అలా ప్రస్తుతం ఈ ఊర్ల నుంచి 650 మంది ఆర్మీలో సేవలందిస్తున్నారు. వీళ్లలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు జవాన్లు కూడా ఉండటం విశేషం. వాళ్లలో పై స్థాయి అధికారులు ఉన్నారు. ఈ జిల్లాకి చెందిన కాంచన గంగ బీఎస్ఎఫ్ సోల్జర్‌గా పనిచేస్తుంది. ఈమె తండ్రి 22 ఏండ్లు దేశానికి సేవ చేశాడు.
కమాండింగ్ ఆఫీసర్ స్థాయికి..
నజ్రుల్ నగర్‌కు చెందిన బిస్వజిత్ కుమార్ కర్ ఆర్మీలో కమాండింగ్ ఆఫీసర్ స్థాయికి ఎదిగాడు. 2000 సంవత్సరంలో యూపీఎస్సీ నిర్వహించిన కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షల్లో పాల్గొని లెఫ్టినెంట్‌గా ఆర్మీకి ఎంపికయ్యాడు ఈయన. ప్రస్తుతం మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్మీలో చేరడానికి యువతను ఇన్స్పైర్ చేస్తుంటాడు కూడా బిస్వజిత్ కుమార్ కర్. ఈయన ఇంటికి వస్తే చాలు తల్లిదండ్రులంతా తమ పిల్లల్ని తీసుకొని ఇతని దగ్గరికి వెళ్తారు .
దేశం కోసం..
చిన్నప్పట్నించీ ఆర్మీలో చేరాలన్న కోరిక ఉండేది. ఆ కల ఆరేండ్ల కిందట నెరవేరింది. నాతో పాటు నా సోదరులు ప్రశాంత్ సర్కార్, ఇంద్రజిత్ సర్కార్లు కూడా దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరారు. దేశ రక్షణ దళంలో మేం ముగ్గురం విధులు నిర్వర్తిస్తున్నప్పుడు భారతమాత మాత్రమే గుర్తుకు వస్తుంది. నేను దేశం కోసం పనిచేస్తుంటే, నా కుటుంబానికి దేశమంతా అండగా ఉంటుందని నమ్ముతా.
- హరి కుమార్ మ్రిదా, ఆర్మీ జవాన్
ముగ్గురు కొడుకులు ఆర్మీలోనే..
నా ముగ్గురు కొడుకులు ఆర్మీలో పనిచేస్తుండటం నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. మొదట నా ఇద్దరు కొడుకులు తొమ్మిదేండ్ల కిందట ఆర్మీలో చేరారు. ఆ మరుసటి ఏడాదే నా మూడో కొడుకు శ్యామల్ ఆర్మీకి ఎంపికయ్యాడు. నా పిల్లలకు చిన్నప్పట్నించీ దేశం పట్ల భక్తి, నిబద్ధతతో ఉండాలని చెప్పేవాడిని. వీళ్లతో పాటు నా సోదరుడు ఆనంద్ మండల్ కూడా 23 ఏండ్లుగా ఆర్మీలో పని చేస్తున్నాడు. వీళ్లంతా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశానికి సేవ చేస్తున్న విషయం గుర్తొస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది.
- రాబిన్ మండల్, జవాన్ల తండ్రి
