అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ డేటా సెంటర్లపై జరిగిన డ్రోన్ దాడులు ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. యూఏఈ, బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్లపై జరిగిన ఈ దాడుల వల్ల క్లౌడ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు నేరుగా టెక్ దిగ్గజం అమెజాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రస్తుత సమస్యకు కారణంగా తెలుస్తోంది. కేవలం యుద్ధం అంటే సరిహద్దుల్లో జరిగే పోరాటమే కాదని, డిజిటల్ నెట్‌వర్క్‌లు కూడా ఇకపై యుద్ధ క్షేత్రాలేనని తాజా ఘటన నిరూపించింది.
యూఏఈలోని రెండు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్లు నేరుగా దాడులకు గురికాగా.. బహ్రెయిన్‌లోని మరో ప్లాంట్ కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ దాడుల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాక, మంటలను ఆర్పే క్రమంలో వాడిన నీటి వల్ల సర్వర్లు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలోని అనేక వ్యాపారాలు, ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. అబుదాబి కమర్షియల్ బ్యాంక్ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థల మొబైల్ యాప్‌లు, ఆన్‌లైన్ సేవలు ఈ అంతరాయం వల్ల పని చేయకుండా పోయాయి. డిజిటల్ లావాదేవీలన్నీ క్లౌడ్ మీద ఆధారపడి ఉండటంతో.. ఒక్కసారిగా సర్వీసులు ఆగిపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి గ్లోబల్ టెక్ కంపెనీలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ హబ్‌గా మార్చాలని వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో డేటా సెంటర్లపై దాడులు జరగడం టెక్ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్లిష్ట సమయంలో తమ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అమెజాన్ సూచించింది. ముఖ్యమైన డేటాను బ్యాకప్ తీసుకోవాలని, సర్వీసులు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని స్పష్టం చేసింది అమెజాన్ సంస్థ.
ఈ ఘటన భారతీయ వ్యాపారవేత్తలకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో అనేక భారతీయ సంస్థలు గ్లోబల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లపైనే ఆధారపడి ఉన్నాయి. ఒక దేశంలో జరిగే యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ సేవలను ఎలా అతలాకుతలం చేయగలదో ఈ అమెజాన్ డేటా సెంటర్ల దాడి ఒక ఉదాహరణగా నిలుస్తోంది. అందుకే డేటా భద్రత కోసం కేవలం ఒక్క ప్రాంతం లేదా ఒక్క క్లౌడ్ సర్వీస్‌పైనే ఆధారపడకుండా.. మల్టీ-క్లౌడ్ ప్లానింగ్ ఎంతో అవసరమని టెక్ నిపుణులు చెబుతున్నారు.
