గద్వాల, వెలుగు: జూరాల రైతులకు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా వస్తున్న నీటి ప్రవాహానికి కొందరు రైతులు రాళ్లతో అడ్డుకట్ట వేసి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో కింది రైతులకు ఇబ్బందులు వస్తున్నాయి. గద్వాల మండలంలో ప్రవహిస్తున్న జూరాల కుడి కాలువ పైభాగంలో డిస్ట్రిబ్యూటరీ నంబర్ 12(పిల్ల కాలువ) బిరెల్లి వద్ద కొందరు రైతులు కాలువలో పెద్దపెద్ద రాళ్లు, మట్టి బస్తాలు వేసి నీటిని అడ్డుకున్నారు.
దీనివల్ల కుడి కాలువ పై ఆదారపడి ఉన్న అనంతపురం, బస్రాచెర్వు గ్రామాల రైతులకు పూర్తి స్థాయిలో సాగు నీరందడం లేదు. దిగువన ఉన్న వందలాది ఎకరాల పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఈ ఇబ్బందులు ఉన్నాయని, అధికారులు స్పందించి అడ్డంకులను తొలగించకపోతే పంటలు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు చెబుతున్నారు.
