
సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో పోడు భూముల అర్హుల జాబితాను రెడీ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అడిషనల్కలెక్టర్ రాజర్షి షా తో కలిసి అటవీశాఖ రేంజ్ ఆఫీసర్స్, పంచాయతీ శాఖ డీఎల్పీవోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామం వారీగా సంబంధిత పంచాయతీ సెక్రటరీ, ఎంపీవో, అటవీ రేంజ్ అధికారులతో వచ్చిన క్లెయిమ్స్ పరిశీలన, నిర్వహిస్తున్న రికార్డులు, సేకరించిన రుజువులు, ఎఫ్ ఆర్ సీ, గ్రామసభల తీర్మానాలు, దరఖాస్తుదారుకు సంబంధించిన ఆధారాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి క్లెయిమ్‌కు సంబంధించి ఆమోదం, తిరస్కరణకు సంబంధించి పూర్తి ఆధారాలు, నివేదికలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపీవో డివిజనల్ పంచాయతీ అధికారి ద్వారా సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి పంపాలని సూచించారు. ప్రతి దరఖాస్తుకూ అటవీ హక్కుల కమిటీ తీర్మానం, గ్రామసభ తీర్మానం ఉండాలని చెప్పారు. అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడే సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి ఇవ్వాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఫిరంగి, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్, డీఎల్పీవోలు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
కొమురవెల్లికి చేరిన ‘అన్నమయ్య’ రథయాత్ర
కొమురవెల్లి, వెలుగు : తిరుమల కొండపై కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని వెంటనే నిర్మించాలని కోరుతూ అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షుడు విజయ శంకరస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన రథయాత్ర కొమురవెల్లికి చేరింది. ఇందులో భాగంగా మల్లికార్జునస్వామిని, జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ లోని కొండ పోచమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2003లో తిరుమల కొండపై కూల్చేసిన సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయ విగ్రహాన్ని యథాస్థానంలో టీటీడీ బోర్డు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 లక్షల 50 వేల సంతకాల సేకరణలో జైభారత్ కార్యకర్తల కృషి అపూర్వం అన్నారు. నెల రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈయాత్ర యాత్ర కొనసాగుతోందని తెలిపారు. అంతకుముందు మల్లన్న ఆలయ అర్చకులు విజయ శంకర స్వామిని శాలువాతో సన్మానించారు.
‘సద్గురు మధుసూదన్’ సేవలు అభినందనీయం
గజ్వేల్, వెలుగు : సత్యసాయి సంజీవిని బాలల గుండె చికిత్స పరిశోధన కేంద్రం ద్వారా చేస్తున్న సద్గురు మధుసూదన్ సత్యసాయి సేవలు అభినందనీయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం కొండపాక మండల కేంద్రంలో గుండె చికిత్స- పరిశోధన కేంద్రాన్ని సద్గురు మధుసూదన్ సత్యసాయితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ 100 మందిలో ఒక చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో చనిపోతున్నారని, ఈ విషయాన్ని సద్గురు మధుసూదన్ సాయి దృష్టికి తేగానే ఇక్కడ బాలల గుండె శస్త్ర చికిత్స ఆసుపత్రి ఏర్పాటు చేశారని తెలిపారు. సింబల్ ఆఫ్ చారిటీగా కొండపాక విద్యా, వైద్యాలయం నిలుస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈడీ నోటీసులతో టెన్షన్!
పలువురి లీడర్లకు తలనొప్పిగా మారిన ‘చీకోటి’ వ్యవహారం
మెదక్, వెలుగు : ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) క్యాసినో ఆర్గనైజర్ చీకోటి ప్రవీణ్ కుమార్ వ్యవహారంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేయడంతో మరో మారు ఈ అంశం చర్చనీయాంశమైంది. ప్రవీణ్ కుమార్ తో సంబంధాలు ఉన్న జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, క్యాసినో కస్టమర్లు, ఏజెంట్లు, ఫైనాన్షియర్లు తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అని టెన్షన్‌పడుతున్నారు.
జిల్లాలో జరిగింది ఇదీ..
క్యాసినో నిర్వహకులు ప్రవీణ్ కుమార్ బర్త్‌డే పార్టీ గత జులై నెలలో హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. దీనికి మెదక్ జిల్లాకు చెందిన ఏజెంట్లు, ఫైనాన్షియర్లు, కస్టమర్లు హాజరయ్యారు. ఆ తర్వాత గత జులై 19న మెదక్ ప్రాంతానికి చెందిన క్యాసినో ఏజెంట్లు, కస్టమర్లు జిల్లాలోని పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల్లోని హరిత హోటల్ లో ఏర్పాటు చేసిన పార్టీకి ప్రవీణ్ కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ను అధికార పార్టీ లీడర్లు, క్యాసినో కస్టమర్లు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఆయనతో సెల్ఫీలు దిగారు. ఏడుపాయల్లో పార్టీ జరిగిన తరువాత రెండు, మూడు రోజులకు ఇద్దరు దేవాలయ పాలక మండలి సభ్యులు, ఒక ఉద్యోగి, మెదక్ పట్టణం, నర్సాపూర్ మండలానికి చెందిన పలువురు వ్యాపారులు ఫ్లైట్ లో గోవా వెళ్లడం గమనార్హం. కాగా హైదరాబాద్ లో క్యాసినో నిర్వహకులు ప్రవీణ్ కుమార్ ఇళ్లు, ఆఫీస్ లలో ఈడీ దాడులు చేసినట్టు వార్తలు రాగానే గోవాకు వెళ్లిన వారు హుటాహుటిన తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు ప్రవీణ్ కుమార్ కు సంబంధించిన ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకోవడం, వ్యాట్సప్, ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్లను పరిశీలించడంతో ఎక్కడ తమ వివరాలు బయట పడుతాయో అని జిల్లాకు చెందిన క్యాసినో ఏజెంట్లు, కస్టమర్లు హైరానా పడ్డారు. అయితే అప్పుడు ఎవరి పేర్లు బయటకు రాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత వారం ఈడీ అధికారులు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డికి నోటీసులు జారీ చేయడంతో చీకోటి ప్రవీణ్ కుమార్‌తో సంబంధాలు ఉన్నవారు తమకు కూడా నోటీసులు వస్తాయోమోనని, ఎంక్వైరీకి పిలుస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు.
పొల్యూషన్‌తో ఇబ్బంది పడుతున్నాం
ఉసిరికపల్లి గ్రామస్తుల ఆందోళన
మెదక్ (శివ్వంపేట), వెలుగు : కంపెనీ పొల్యూషన్‌తో ఇబ్బంది పడుతున్నామని శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామస్తులు ఆందోళన చేశారు. గురువారం గ్రామ సర్పంచ్ బాబూరావు, ఎంపీటీసీ సత్తిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను గ్రామ శివార్లలో లైట్ వెయిట్ సిమెంట్ బ్రిక్స్ కంపెనీ వద్దకు తీసుకెళ్లి తమ ఇబ్బందులను వివరించారు. కంపెనీ నుంచి దుర్వాసన వస్తుండటంతో గ్రామంలో ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను చెరువులోకి వదులుతున్నారని తెలిపారు. కంపెనీని వెంటనే తమ గ్రామం శివారులో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కృష్ణారావు, బీసీ సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి, గ్రామస్తులు భిక్షపతి, లక్ష్మీనారాయణ, బాలేశ్ పాల్గొన్నారు.
ఇద్దరు పిల్లలు, తల్లిని చంపిన కేసులో మహిళకు జీవిత ఖైదు
మెదక్, వెలుగు : ఇద్దరు పిల్లలు, తల్లిని చంపిన కేసులో మహిళకు జీవిత ఖైదు పడింది. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపిన ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అల్మాయిపేట గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి, మెదక్ పట్టణం నవాపేట నివాసి అయిన రెడ్డిపల్లి శ్యామల భార్యభర్తలు. వారికి కూతురు స్పందనరెడ్డి (7), కొడుకు నందకేశవరెడ్డి (4) ఉన్నారు. కొంత కాలానికే దంపతులిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. శ్యామల మెదక్ మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తూ తన పిల్లలు, తన తల్లితో కలిసి ఉంటుంది. కాగా ఆమెకు కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో అవి భరించలేక కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 2014 మార్చి 26న తన ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్ లో విషం కలిపి తాగించి, తల్లి, తాను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ప్లాన్ ప్రకారం పిల్లలను చంపి తర్వాత తన తల్లితో కలిసి తాను చెరువులో దూకానని, కొందరు తనను కాపాడారని శ్యామల తెలిపింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లా కోర్టులో జరిగిన విచారణలో మెజిస్ట్రేట్ ఆమెకు గురువారం యావజ్జీవ శిక్షతో పాటు, రూ.50 వేల జరిమానా విధించింది.
గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
సిద్దిపేట రూరల్, వెలుగు : గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిద్దిపేట వన్ టౌన్ సీఐ భిక్షపతి తెలిపారు. గురువారం మధ్యాహ్నం సిద్దిపేట పట్టణంలోని గంగాజల్ వాటర్ ప్లాంట్ చౌరస్తా వద్ద వన్ టౌన్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ఒక క్వాలిస్, రెండు ద్విచక్రవాహనదారులను అదుపులోకి తీసుకొని విచారించారు. గొలుసుల అరవింద్, గొలుసుల అలికేశ్, తేలు ప్రశాంత్ ముగ్గురు చేర్యాల ప్రాంతానికి చెందివారు కాగా, ప్రస్తుతం సిద్దిపేటలో కలిసి ఉంటున్నారు. వారి మూడు వాహనాల్లో కలిసి 600 గ్రాముల బరువుగల, 20 గంజాయి ప్యాకెట్లు దొరికాయి. వెంటనే వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించామని, నిందితుల వాహనాలతోపాటు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
టీఆర్ఎస్ కుట్రలు పసిగట్టలేకపోయా?
- సొంతగూటికి చేరిన అరిగె కృష్ణ
- ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరిక
దుబ్బాక, వెలుగు: దేశం కోసం, ధర్మ కోసం పాటు పడే బీజేపీని వదిలి టీఆర్ఎస్ కుట్రలను పసిగట్టలేక ఆ పార్టీలో చేరానని బీజేపీ మండల అధ్యక్షుడు అరిగె కృష్ణ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు కుట్రలతో మభ్యపెట్టారని, దీంతో ఆగమయ్యానని ఎమ్మెల్యే రఘనందన్‌రావు నేతృత్వంలో బీజేపీలో పని చేయడానికి తిరిగొచ్చానని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులను టీఆర్ఎస్ నేతలు డబ్బుల సంచులతో కొనుగోలు చేసి ఆగం చేస్తున్నారన్నారు. బీజేపీ అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా పని చేస్తానని, పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.