మాకు నితీశ్ ​అక్కర్లేదు .. కొంచెం ఒత్తిడి వచ్చినా ఆయన యూటర్న్ ​తీస్కుంటరు: రాహుల్

మాకు నితీశ్ ​అక్కర్లేదు ..  కొంచెం ఒత్తిడి వచ్చినా ఆయన యూటర్న్ ​తీస్కుంటరు: రాహుల్

పూర్నియా(బిహార్):  బిహార్​లో సామాజిక న్యాయం కోసం మహాఘట్బంధన్ (మహా కూటమి) పోరాటం కొనసాగిస్తుందని, ఇండియా కూటమికి సీఎం నితీశ్ కుమార్ అవసరం లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు.   మంగళవారం బిహార్ లోని పూర్నియా జిల్లాలో భారత్‌‌ జోడో న్యాయ్ యాత్రలో ఆయన మాట్లాడారు.  ‘‘నితీశ్‌‌ ఎందుకు విపక్ష కూటమిని వీడారో తెలుసు.  బిహార్‌‌లో కులగణన విషయంపై కాంగ్రెస్‌‌, ఆర్జేడీ ఒత్తిడి తీసుకువచ్చింది. అందుకు బీజేపీ భయపడింది. ఆ పార్టీ దీనికి వ్యతిరేకం. ఇరుపక్షాల మధ్య నితీశ్‌‌ ఇరుక్కుపోయారు. పారిపోవడానికి బీజేపీ ఆయనకు దారి చూపించింది. సామాజిక బాధ్యత అందించడం కూటమి బాధ్యత. అందుకు నితీశ్‌‌ అవసరం లేదు. 

కొంచెం ఒత్తిడి వచ్చినా ఆయన యూటర్న్‌‌ తీసుకుంటారు’’ అని విమర్శించారు. పొద్దున రాజీనామా చేసి సాయంత్రం ప్రమాణస్వీకారం చేయడం పట్ల గవర్నరే ఆశ్చర్యం వ్యక్తం చేసి ఉండొచ్చని ఎద్దేవా చేశారు.  దేశంలో అన్ని రంగాల్లో దళితులు, వెనుకబడిన తరగతులకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని రాహుల్ అన్నారు. మన దేశంలో దళితులు, ఓబీసీలు, గిరిజనులు తదితరుల కచ్చితమైన జనాభాను గుర్తించడానికి కుల ఆధారిత జన గణన అవసరం అని పేర్కొన్నారు. మణిపూర్ అంతర్యుద్ధ వాతావరణాన్ని అనుభవిస్తోందని, జాతి కలహాలతో దెబ్బతిన్న ఆ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ ఇప్పటి వరకు సందర్శించలేదని విమర్శించారు. 

మోదీ సర్కారు రైతుల విశ్వాసం కోల్పోయింది

ప్రధాని మోదీ ప్రభుత్వం రైతుల విశ్వాసాన్ని కోల్పోయిందని, కాంగ్రెస్‌‌ అధికారంలోకి వస్తే రైతుల విశ్వాసం నిలబెట్టుకుంటామని రాహుల్‌‌ అన్నారు. పూర్నియా జిల్లాలో  పలువురు రైతులతో ఆయన మాట్లాడారు. “మోదీ ప్రభుత్వం రైతుల భయాలను తొలగించడంలో విఫలమైంది. నిజానికి, అది రైతుల నమ్మకాన్ని కోల్పోయింది. మాకు ఒక అవకాశం ఇవ్వాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మేము మీ నమ్మకాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాం” అని వెల్లడించారు. తనవి కేవలం వట్టి మాటలు కావని, కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను చూడాలన్నారు. భూసేకరణ బిల్లు తీసుకొచ్చామని, దేశవ్యాప్తంగా రైతులకు రూ.72 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేశామని, చత్తీస్‌‌గఢ్,  రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో  రైతులు తమ ఉత్పత్తులకు తగిన మద్దతు ధర పొందేలా కృషి చేశామని చెప్పారు. కాగా, ర్యాలీలో ప్రసంగించాల్సిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పూర్నియాకు చేరుకోలేకపోయారని, ఆయన ఫ్లయిట్​ క్యాన్సిల్​అయిందని బిహార్ కాంగ్రెస్ చీఫ్ అఖిలేశ్  ప్రసాద్ తెలిపారు. చత్తీస్‌‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, సీపీఐ(ఎంఎల్)ఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య కూడా సభలో ప్రసంగించారు.