ఒకే సీటు కోసం.. ఒకే ఫ్యామిలీలో ఇద్దరు దరఖాస్తు

ఒకే సీటు కోసం.. ఒకే ఫ్యామిలీలో ఇద్దరు దరఖాస్తు
  • ముషీరాబాద్ సీటు కోసం తండ్రీకొడుకుల అప్లికేషన్
  • కరీంనగర్‌‌‌‌ నుంచి తల్లీకొడుకు, అందోల్ నుంచి తండ్రీకూతురు
  • నాగార్జున సాగర్‌‌‌‌లో జానారెడ్డి కొడుకుల దరఖాస్తు

హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం భారీగా ఆశావహులు పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల ఒకే సీటుకు ఒకే కుటుంబంలోని ఇద్దరు దరఖాస్తు పెట్టుకున్నారు. అన్నాదమ్ములు, తండ్రీకొడుకులు, తల్లీకొడుకులు, తండ్రీకూతురు అప్లై చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అంజన్ కుమార్ యాదవ్, ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్.. కరీంనగర్ సెగ్మెంట్‌‌కు కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు, ఆమె కుమారుడు రితేశ్ రావు.. అందోల్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం, సీడబ్ల్యూసీ పర్మినెంట్ ఇన్వైటీ దామోదర రాజనర్సింహ, ఆయన కూతురు త్రిష.. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి ఇద్దరు కుమారులు రఘువీర్​ రెడ్డి, జయవీర్ రెడ్డి దరఖాస్తులు సమర్పించారు. మిర్యాలగూడకూ రఘువీర్ రెడ్డి అప్లికేషన్ ఇచ్చారు. ఏ నియోజకవర్గం నుంచీ జానారెడ్డి తన దరఖాస్తును సమర్పించలేదు.

ఎమ్మెల్యే బరిలో ఎంపీలు

కాంగ్రెస్ నుంచి లోక్​సభకు ఎన్నికైన ముగ్గురు ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ టికెట్ కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. వారితో పాటు మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా దరఖాస్తు చేశారు. గతంలో నిజామాబాద్​ ఎంపీగా ఉన్న మధుయాష్కీ గౌడ్​.. ఇప్పుడు ఎల్బీనగర్ నుంచి పోటీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కరీంనగర్​ఎంపీగా పని చేసిన పొన్నం.. హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి మూడు సెగ్మెంట్లకు అప్లై చేసుకున్నారు. పాలేరుతో పాటు ఖమ్మం, కొత్తగూడెం టికెట్లకూ దరఖాస్తులిచ్చారు. బలరాం నాయక్.. మహబూబాబాద్ నుంచి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు సమర్పించారు.