అగ్నిప్రమాదంలో చిక్కుకున్న 100 మంది..రక్షించిన సిబ్బంది

అగ్నిప్రమాదంలో చిక్కుకున్న 100 మంది..రక్షించిన  సిబ్బంది

ఒడిశా రాష్ట్రం పూరీలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  ఈ అగ్ని ప్రమాదంలో 40 దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో షాపింగ్ కాంప్లెక్స్‌లో చిక్కుకున్న 100 మందికి పైగా ప్రజలను అధికారులు రక్షించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ప్రమాద వివరాలు..

బుధవారం రాత్రి 9 గంటలకు  లక్ష్మీ మార్కెట్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో ఉన్న గార్మెంట్ స్టోర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు కాంప్లెక్స్‌ మొత్తానికి వ్యాపించాయి.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్  సిబ్బంది .. 12 ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. జగన్నాథ ఆలయానికి సమీపంలో ఉన్న ఈ భవనంలో షాపింగ్ క్లాంప్లెక్స్తో పాటు.. రెండు వేర్వేరు అంతస్తుల్లో హోటల్, బ్యాంకు ఉన్నాయి. అయితే పూరి జగన్నాథుడి దర్శనానికి నాసిక్ నుంచి వచ్చిన 106 పర్యాటకులు హోటల్లో ఉన్నారు. మంటలు హోటల్కు కూడా వ్యాపించడంతో..వారందరు అందులోనే చిక్కుకున్నారు. దీన్ని గమనించిన అధికారులు వారిని సురక్షితంగా రక్షించారు. భవనం పైభాగంలో ఇరుక్కుపోయిన ముగ్గురు వ్యక్తులను అగ్నిమాపక సిబ్బంది అపస్మారక స్థితిలో రక్షించారని అధికారులు తెలిపారు. 

అస్వస్థతకు గురైన సిబ్బంది...

అటు మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది వేడి.., పొగ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదని పూరి సబ్ కలెక్టర్ భవతరణ్ సాహు తెలిపారు