చెత్త డబ్బుల విషయంలో గొడవ.. వ్యక్తి హత్య ..నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేసిన పోలీసులు

చెత్త డబ్బుల విషయంలో గొడవ.. వ్యక్తి హత్య ..నిందితులను 24 గంటల్లో  అరెస్ట్ చేసిన పోలీసులు

మేడ్చల్, వెలుగు: మేడ్చల్​చెక్​పోస్ట్​ఏరియాలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో నిందితులను 24 గంటల్లో అరెస్ట్​చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. నరసింహ(37), వరంగల్​కు చెందిన అనిత, నిజామాబాద్ కు చెందిన నర్సింహులు మేడ్చల్​చెక్​పోస్ట్​ఏరియాలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తరచూ స్థానిక వెంకటరమణ లిక్కర్​అండ్​వైన్స్ కు వచ్చి, మద్యం మత్తులో గొడవ పడుతున్నారు. గత శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నరసింహ మద్యం మత్తులో రోడ్డుపై పడిపోయాడు. సాయంత్రం 6 గంటలకు అనిత, నర్సింహులు వచ్చి అతనితో తాము స్క్రాప్ డబ్బులు తీసుకుంటున్నామని చెప్పడంతో గొడవ జరిగింది.

 ఇద్దరూ కలిసి నరసింహను విచక్షణారహితంగా కొట్టారు.  ఆ దెబ్బలకు తాళలేక అతను మృతిచెందాడు. వైన్స్ క్యాషియర్ మహేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ, ఎస్సైలు సురేశ్​, యతీశ్​చంద్ర ఆదివారం నిందితులు నరసింహ, అనితను పట్టుకున్నారు. విచారణలో చెత్త డబ్బుల విషయంలో విభేదాలు రావడం వల్లే అతన్ని చంపినట్లు వారు ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్​చేసి, రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు. అయితే మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదని పేర్కొన్నారు.