మేడిపల్లి, వెలుగు : తాను కొడుతుంటే ఆ విషయం కొడుకుతో చెప్తోందని ఓ భర్త ఆమె నిద్రపోతున్నప్పుడు సుత్తెతో దాడి చేసి చంపబోయాడు. మేడ్చల్మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వతాపూర్ గాంధీనగర్ కాలనీలో ఘౌస్ పాషా ఖురేషీ (42), జైబున్ బేగం (28)దంపతులు ఉంటున్నారు. నిందితుడు తరచూ మద్యం తాగి వచ్చి భార్యను కొట్టేవాడు.
భర్త కొట్టినప్పుడల్లా విషయాన్ని తన కొడుకులకు చెప్తుండేది. ఇది తెలుసుకున్న భర్త ఖురేషి ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ నెల 10వ తేదీ రాత్రి కూడా భార్యతో గొడవపడి కొట్టాడు. ఇది చూసిన కొడుకులు జోక్యం చేసుకుని తండ్రిని మందలించి వివాదాన్ని సద్దుమణిగించారు.
అయితే, తన కొడుకులు తనను మందలించడానికి కారణం తన భార్యేనన్న కోపంతో 11వ తేదీ తెల్లవారుజామున ఆమె వేరే గదిలో పడుకోగా..సుత్తె తీసుకువెళ్లి తలపై కొట్టడం మొదలుపెట్టాడు. ఆమె గావుకేకలు పెట్టడంతో కొడుకులు వచ్చి తండ్రిని పక్కకు తోసేసి ఆమెను గాంధీ దవాఖానకు తరలించారు. మేడిపల్లి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
