మర్డర్ చేసి ఇన్​స్టాలో పోస్టు

మర్డర్  చేసి ఇన్​స్టాలో పోస్టు
  • 12 సార్లు కత్తులతో పొడిచి, బండరాయితో బాది హత్య
  • హైదరాబాద్​లోని బాచుపల్లిలో దారుణం 

జీడిమెట్ల, వెలుగు: పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిని అతని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా చంపారు. కత్తులతో పొడిచి, బండరాయితో బాది హత్య చేశారు. చంపుతున్న దృశ్యాలను వీడియో తీసి ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్​లోని బాచుపల్లిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన పిల్లి తేజస్​ కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్  వచ్చింది. ఎస్ఆర్​ నగర్​లోని దాసారాం బస్తీలో స్థిరపడింది. 

తేజస్​ ఓ గ్యాంగ్  లో సభ్యునిగా ఉంటూ చిల్లరగా తిరిగేవాడు. ​2023 అక్టోబర్​ 10న ఎస్ఆర్ ​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో తరుణ్​రాయ్​ అనే రౌడీ షీటర్​ హత్యకు గురయ్యాడు. 

ఈ హత్య కేసులో తేజస్  ఏ3గా ఉన్నాడు. రెండు నెలల క్రితం ఈ కేసులో అతను బెయిల్​పై బయటకు వచ్చాడు. అదే ఏరియాలో ఉంటే ప్రాణాపాయం ఉంటుందని భయపడి ప్రగతినగర్​లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తల్లితో పాటు నివాసం ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం అతని తల్లి  వేములవాడకు వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి  తేజస్  తన స్నేహితులు శివప్ప (ఇతను తేజస్ కు, అతని ప్రత్యర్థులకు కామన్  ఫ్రెండ్), మహేశ్, మరో మహేశ్ తో కలిసి మద్యం తాగాడు. అదే సమయంలో శివప్పకి తరుణ్  రాయ్​ గ్యాంగ్  సభ్యుడు సమీర్​ ఫోన్​ చేశాడు. 

తాను తేజస్​ వద్ద ఉన్నానని శివప్ప చెప్పాడు. తాను వస్తానని, లొకేషన్​ షేర్​ చేయాలని అడగడంతో శివప్ప లొకేషన్​ షేర్​ చేశాడు. ఇదే అదనుగా భావించిన సమీర్, జయంత్, సిద్ధేశ్వర్​ ప్రగతినగర్​కి వెళ్లారు. ఈ క్రమంలో శివప్ప సిగరెట్​ తాగుదామని తేజస్​ను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లాడు. అప్పటికే కాపుకాసిన  సమీర్, జయంత్, సిద్ధేశ్వర్​తోపాటు శివప్ప సైతం తేజస్ పై దాడిచేశారు. 

తేజస్​ పారిపోవడానికి  ప్రయత్నించగా వెంటాడి కత్తులతో 12 సార్లు పొడిచారు. చనిపోయాడో లేదోననే అనుమానంతో బండరాయితో మోది దారుణంగా హత్యచేశారు. తేజస్​ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత  హత్య చేసిన కత్తిని, రక్తపు మరకలు ఉన్న చేతులను చూపుతూ బైక్​పై వెళ్తూ  వీడియో చేసి ఇన్​స్టాలో అప్​లోడ్​ చేశారు. ఆ వీడియోకు ఓ పాట సైతం జోడించారు. నిరుడు ఎస్ఆర్​నగర్​లో హత్యకు గురైన రౌడీ షీటర్​ తరుణ్​ హత్యకు ప్రతీకారంగా తేజస్ ను చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు. స్పాట్​ను ఏసీపీ శ్రీనివాస్​ రెడ్డి, సీఐ ఉపేందర్​ పరిశీలించారు.