ఫైనాన్స్​లో వెహికల్స్ తీస్కొని .. బ్యాంకులకు టోకరా

ఫైనాన్స్​లో వెహికల్స్ తీస్కొని ..  బ్యాంకులకు టోకరా

ఎల్​బీనగర్, వెలుగు: ఫైనాన్స్​లో తీసుకున్న వెహికల్స్ కు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి బ్యాంకులు, ఆర్టీఏ అధికారులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని భువనగిరి ఎస్​వోటీ, హయత్​నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్ బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వైజాగ్ కు చెందిన కరుమూరి వీరవెంకట సత్య అలియాస్  నాగరాజు(48)  2015లో సిటీకి వచ్చి తిరుమలగిరిలో ఓ ఇల్లు రెంట్​కు తీసుకున్నాడు.

 ‘వర్ధన ఇండస్ట్రీస్ .. ఫాస్ట్ కన్జ్యూమర్ గూడ్స్ సప్లయ్’ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్ శ్రావణిని 10 శాతం వాటా కింద  డైరెక్టర్​గా నియమించుకున్నాడు. హెచ్​డీఎఫ్ సీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న నాగరాజు.. 2018లో కారు కొన్నాడు. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.  కొన్ని నెలల తర్వాత ఫేక్ స్టాంపులు, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ సంతకంతో ఫేక్ ఎన్​వోసీలను క్రియేట్ చేశాడు. వాటిని ఆర్టీఏ ఆఫీసులో సబ్మిట్ చేసి   ఆర్సీలో ఫైనాన్స్ అనే పదాన్ని తొలగించుకుని కొత్త ఆర్సీని పొందాడు. 

ఆ తర్వాత కంపెనీ డైరెక్టర్ శ్రావణిని కొనుగోలుదారురాలిగా చూపించి కారుకు ఆమెకు అమ్ముతున్నట్లు పేపర్లు క్రియేట్ చేసి యాక్సిస్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు. ఇలా నాగరాజు పలుమార్లు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని మోసాలకు పాల్పడ్డాడు. నాగరాజుపై నిఘా పెట్టిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.  కోటి 28 లక్షల విలువైన 6 కార్లు, 3 బైక్​లు, ఫేక్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.