రాజు సేఫ్.. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్

రాజు సేఫ్.. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్

కొండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన రాజును పోలీసులు ఎట్టకేలకు రక్షించారు. పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ఫైర్​శాఖల రెస్క్యూ ఆపరేషన్ తో  గాయాలపాలైన రాజును బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు.  

రాజును ఎంతో రిస్క్ చేసి క్షేమంగా బయటకు తీశామని పోలీసులు చెప్పారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది అహర్నిశలు కష్టపడటం వల్లే  రాజు బయటకు వచ్చారని అన్నారు.  కొండలను చిన్నచిన్నగా ముక్కలు చేసి రాజును బయటకు తీయడం జరిగిందన్నారు. అతని భుజానికి తప్ప ఎక్కడా గాయం కాకుండా రక్షించామన్నారు. దయచేసి ఎవరూ ఇటువంటి సాహసాలు చేయొద్దని సూచించారు.  రాజును క్షేమంగా కాపాడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.  రెస్క్యూ టీంను అభినందిస్తామని చెప్పారు.

 



సింగరాయిపల్లి శివారులో ఫారెస్ట్ ఏరియాలో వేటకు వెళ్లిన రాజు అనే వ్యక్తిని రక్షించారు. రాళ్ల గుట్టల సందుల్లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించిన రాజు.. ఎట్టకేలకు ప్రాణంత బయటపడ్డాడు. దాదాపు 43 గంటలకు పైగా రాళ్ల మధ్యలోనే ఉండిపోయిన రాజును బయటకు తీశారు. బాధితుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వివిధ శాఖ అధికారులు.. సమన్వయంతో పని చేసి, రాజు ప్రాణాన్ని కాపాడారు. రాజును కాపాడేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేశారు. లెటెస్ట్ టెక్నాలజీ సాయంతో బండ రాళ్లను బ్లాస్ట్ చేశారు. చివరి రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడంతో కుటుంబ సభ్యులతో పాటు అధికారులందరూ ఊపీరి పీల్చుకున్నారు. తాము పడ్డ కష్టం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు.  

అసలేం జరిగిందంటే..!

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు అనే వ్యక్తి తరచూ ఫారెస్టు ఏరియాలో వేటకు వెళ్తుంటాడు. ఉడుములు, ఇతర చిన్నపాటి జంతువులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈనెల 13వ తేదీన (మంగళవారం) మధ్యాహ్నం రాజు వేటకు వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి బయటకు వెళ్లాడు. ఫారెస్ట్ కు వెళ్లిన రాజు.. రాళ్లపై నుంచి వెళ్తుండగా అతడి సెల్ ఫోన్ పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ తలకిందులుగా రాళ్ల మధ్యలోకి జారి ఇరుక్కుపోయాడు. మంగళవారం సాయంత్రం ఇరుక్కుపోగా.. బుధవారం గుర్తించారు. అయితే.. రాత్రి అయినా రాజు ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికారు. చాలామందిని అడిగారు. ఎవరి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నిన్న మధ్యాహ్నం సమయంలో రాజును వెతుక్కుంటూ ఫారెస్టు ఏరియా లోపలికి వెళ్లారు. తరచూ రాజు తిరిగే ప్రాంతాల్లో గాలించారు.

షాక్ లో కుటుంబ సభ్యులు

ఇదే క్రమంలో సింగరాయిపల్లి శివారులోని పెద్ద రాళ్ల గుట్ట మధ్యలో నుంచి అరుపులు వినిపించడంతో రాజు కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లారు. లోపలి నుంచి అరుస్తున్న వ్యక్తిని రాజుగా గుర్తించారు. రాళ్ల మధ్య సందులో ఇరుక్కుపోయిన రాజును చూసి కుటుంబ సభ్యులు టెన్షన్ పడ్డారు. ఆ సమయంలో కేవలం కాళ్లు మాత్రమే బయటకు కనిపించాయి. రాజును బయటకు తీసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకపోయింది. విషయం తెలియగానే ఘటనా స్థలానికి  పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ఫైర్​ఆఫీసర్లు, సిబ్బంది చేరుకున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. రాళ్లగుట్ట పక్కన జేసీబీతో తవ్వారు. రాత్రి 12 గంటల వరకు కూడా బయటకు తీయలేకపోయారు. 

వేగంగా కొనసాగిన రెస్క్యూ  ఆపరేషన్

ఇవాళ ఉదయం నుంచి రాజును కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగింది. పోలీసులు అన్ని ప్రయత్నాలు చేశారు. పెద్ద బండ రాళ్లను తొలగించేందుకు కంప్రెసర్ బ్లాస్ట్ చేశారు.రాజు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు అతడి ఫ్రెండ్ అశోక్ ను బండ రాళ్ల మధ్యలోకి పంపించారు. తాగునీరు, కొన్ని ఫ్రూట్స్ ను రాజుకు ఇచ్చి వచ్చాడు అశోక్. రాజుతో మాట్లాడాడు. బండ రాళ్ల మధ్యలో ఉన్న రాజుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా.. కంట్రోల్ బ్లాస్ట్ (లెటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించారు ) చేశారు. కంట్రోల్ బ్లాస్ట్ అంటే.. రాళ్లను బ్లాస్ట్ చేసినప్పుడు అవి ఎగిరిపడకుండా ఉన్నచోటనే విరిగిపోయేలా చేసే ప్రక్రియ. పరిమిత సంఖ్యలో మందు గుండు సామాగ్రిని వాడుతారు. ఇప్పటికే రెండు బ్లాస్ట్ లు చేశారు.మరోవైపు.. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. 

గాయాలపాలైన రాజును ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత అంబులెన్స్ లో రాజు ఆస్పత్రికి తరలించారు. దీంత అందరూ ఊపీరి పీల్చుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ఉన్నతాధికారులు తీవ్రంగా శ్రమించడంతో ఇదంతా సాధ్యమైందని చెబుతున్నారు.