
పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయొద్దు. నాకు నచ్చినప్పుడు.. నాకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటానన్నది నేటి తరం మహిళల వాదన! నేను కట్నం ఇవ్వను. నా కెరీర్‌ను వదులుకోను. ఇంటి పనిని ఒంటరిగా చేయను. మాతృత్వం నా ఎంపిక, సామాజిక కర్తవ్యం కాదు వంటి షరతులపైనే వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
సమాజంపై మహిళలు తిరుగుబాటు చేస్తున్నారా? వంటింట్లో విప్లవం మొదలైందా? ఇప్పటివరకు ఉన్న కట్టుబాట్లను ప్రశ్నిస్తున్నారెందుకు? పెళ్లి పట్ల ఇన్ని ఆంక్షలా? అసలు వీళ్లకు పెళ్లి అవుతుందా? అని ప్రశ్నించేవారికి గట్టిగా సమాధానం చెపుతున్నారు ఇప్పటి మహిళలు!ఇది తిరుగుబాటు కాదు.. ఇది అవగాహన. ఇది ధిక్కారం కాదు.. గౌరవం. ఇది నారీవాదం కాదు.. మానవతావాదం.
ఒక స్త్రీ షరతులతో కాకుండా స్వతంత్రంగా జీవించాలనుకోవటం తప్పెలా అవుతుంది? అది ఆమె హక్కు. ఈ మార్పు ఒక్క వ్యక్తిగతమైనది మాత్రమే కాదు.. ఇది ఒక సామాజిక విప్లవాన్ని సూచిస్తుంది. భారతీయ మహిళలు వివాహాన్ని ఒక బాధ్యతగా చూడడం మానేశారు. వారు దానిని స్పష్టత, ధైర్యంతో చేసే ఎంపికగా చూస్తున్నారు. వారి ఆలోచనలు ఈవిధంగా ఉన్నాయి. ‘ఒక సంబంధం నన్ను నా నుంచి వేరుచేస్తే, అది ప్రేమ కాదు, అది బంధనం.’ పెళ్లిపై మారుతున్న మహిళల ఆలోచనకు ఈ వాక్యాలు దర్పణం పడుతున్నాయి.
ఇప్పటి మహిళలు ఆలస్యంగానైనా పెళ్లి చేసుకుంటున్నారు. లేకపోతే ఒంటరి జీవితం గడపటానికైనా ఇష్టపడుతున్నారు. అంతేకానీ ఎదో ఒకటిలే అని వచ్చిన సంబంధాన్ని, పెద్దలు చూసిన సంబంధాన్ని చేసుకోవటానికి మనస్ఫూర్తిగా అసలు ఇష్టపడటం లేదు. పెళ్లిపట్ల ఆచితూచి అడుగువేసే ధోరణి పెరిగింది. స్వేచ్ఛ, సమానత్వం కోరుకుంటున్న ఈ తరం మహిళలు పెళ్లనేది బంధనం కారాదనే భావనలో ఉన్నారు. మహిళలు మారుతున్నారు. చైతన్యవంతులవుతున్నారు.
విద్య, ఆర్థిక స్వాతంత్య్రం
విద్యావంతురాలైన స్త్రీ కేవలం ‘భార్య’గా మాత్రమే ఉండాలని ఇప్పుడు కోరుకోవడం లేదు. ఆమె ఒక ఉద్యోగిగా, బాధ్యతాయుతమైన పౌరురాలుగా, అన్నింటికంటే ఒక మనిషిగా ఉన్నతమైన గుర్తింపు కోరుకుంటుంది. ఐఐటీలు, ఐఐఎంలు, ఏఐఐఎంఎస్ నుంచి గ్రాడ్యుయేట్ చేసినవారు లేదా విదేశాల్లో మాస్టర్స్ చేసినవారు, వారి జీవితంలో అన్ని నిర్ణయాలను వారే తీసుకునేటప్పుడు, వివాహం ఎప్పుడు, ఎవరిని చేసుకోవాలనే విషయంలో ఇతరులు ఎందుకు నిర్ణయించాలి అన్నది వారి ప్రశ్న.
అత్యంత విద్యావంతులైన మహిళలు వివాహాన్ని సగటున 4 నుంచి 7 సంవత్సరాలు వాయిదా వేస్తున్నారు. ఈ ఆలస్యం తమకు సమస్య కాదంటున్నారు. ఇది ఒక స్పృహతో కూడిన నిర్ణయంగా భావిస్తున్నారు. వివాహం జీవితంలో ఒక భాగం కావచ్చని, కానీ అది వారి జీవితాన్ని డిసైడ్ చేయకూడదని గట్టిగా ఫీల్ అవుతున్నారు.
కెరీర్ ఇప్పుడు కొత్త ‘భద్రత’
ఒకప్పుడు మహిళకు భద్రత అంటే భర్త. ‘వివాహం చేసుకో, ఎవరో ఒకరు నిన్ను చూసుకుంటారు’ అని గతంలో చెప్పేవారు. కానీ, ఇప్పుడు మహిళలు తమను తాము సంపూర్ణంగా చూసుకోగల సామర్థ్యం కలిగి ఉన్నారు. వారు బ్యాంకింగ్, టెక్, విద్య, సైన్యం, మీడియా రంగాల్లో నాయకత్వం వహిస్తున్నారు. వారికి ఎవరి ఆశ్రయం అవసరం లేదు. వారు తమ సొంతకాళ్లపై నిలబడే సామర్థ్యాన్ని సంపాదించుకున్నారు. 2023 లింక్డ్ఇన్ నివేదిక ప్రకారం, 62% భారతీయ మహిళలు వివాహం కంటే తమ కెరీర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారికి వివాహం ఇకపై ‘భద్రతాజాలం’ కాదు. బదులుగా ఒక ‘భాగస్వామ్య ప్రయాణం’.
బంధాలు.. సమానత్వం
భర్త ఉన్న చోటే స్వర్గం ఉంది. భర్తకు అణిగిమణిగి ఉండాలన్న పాత విధానం తప్పని గట్టిగా చెపుతున్నారు. సంబంధాలు సమానత్వంపై ఆధారపడి ఉండాలని ఈతరం మహిళలు గట్టిగా నమ్ముతున్నారు. పుట్టింటి తరహాలో మెట్టినింట్లో సైతం గౌరవం.. సమానత్వం కోరుకుంటున్నారు.
మహిళలు తమ కలలను పంచుకునే, వారి ఆశయాలను సమర్థించే, బాధ్యతలను విభజించే వ్యక్తిని కోరుకుంటున్నారు. ఇది దొరకనప్పుడు, వారు ఒంటరిగా నడవడాన్ని ఇష్టపడుతున్నారు. సంబంధాలకు భయపడటం వల్ల కాదు, గౌరవం, వ్యక్తిత్వాన్ని విలువైనదిగా భావించడం వల్ల.
విడాకులు.. వాస్తవాలు
మనఃశాంతికి ఇప్పటి మహిళ ప్రాధాన్యతనిస్తోంది. పెళ్లి ఆ శాంతిని హరించేటట్లయితే ఆ పెళ్లి వద్దని ఘంటాపథంగా చెపుతోంది నేటి మహిళ. విడాకులు ఇప్పుడు కేవలం పాశ్చాత్య ధోరణి మాత్రమే కాదు. మన దేశంలో కూడా విచ్ఛిన్నమైన వివాహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒత్తిడితో లేదా భయంతో జరిగిన వివాహాలు విషపూరితమవుతాయని, అవి విడాకులకు దారితీస్తున్నాయని మహిళలు గ్రహిస్తున్నారు.
2022 నేషనల్ లా యూనివర్సిటీ నివేదిక ప్రకారం, 70% విడాకులు తీసుకున్న మహిళలు తమకు ఎక్కువ సమయం, ఒత్తిడి లేకపోతే విడాకులను నివారించవచ్చని భావించారు. అందుకే నేటి మహిళలు తొందరపడటం లేదు. స్పృహతో ఎంపిక చేసుకుంటున్నారు.
గ్రామీణ మహిళ సైతం
నగరాల్లో మాత్రమే కాదు, గ్రామీణ భారతంలో కూడా ఈ ట్రెండ్ మొదలయింది. డిజిటల్ ఇండియా చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా ఈ అవగాహనను తీసుకొచ్చింది. చిన్న పట్టణాల్లోని బాలికలు ఇప్పుడు వివాహం కన్నా అంతకు మించి ఆలోచిస్తున్నారు.
వ్యక్తిగత స్వాతంత్య్రం కోసం కలలు కంటున్నారు. మంచి కెరీర్, గౌరవాన్ని సంపాదించాలని, తాము కోరుకున్నట్లు జీవించాలని అనుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు కూడా ఇప్పుడు తమ కుమార్తెలు వివాహానికి ముందు ఆర్థికంగా స్వతంత్రులవ్వాలని కోరుకుంటున్నారు.
30 ఏళ్లు దాటితే...
ఈ మార్పు నెమ్మదిగా ఉన్నప్పటికీ, ఇది విప్లవాత్మకమైనది, వేగంగా వ్యాపిస్తోంది. 30 ఏళ్ల వయసు దాటి పెళ్లి చేసుకునే మహిళలకు సంతానం ఎదిగిరావడానికి చాలా కాలం పడుతుంది. అలాగే సంతాన సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యలను కూడా మహిళలు తమ పెళ్లి విషయంలో దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే వారి భవిష్యత్తుకు మరింత మంచి జరిగే అవకాశం ఉంటుంది.
–శ్యామ్ వేలూరి, సీనియర్ జర్నలిస్ట్–