గ్రేటర్ హైదరాబాద్‌లో జడివాన.. జనజీవనం అస్తవ్యస్తం

గ్రేటర్ హైదరాబాద్‌లో జడివాన.. జనజీవనం అస్తవ్యస్తం

హైదరాబాద్ సిటీ/మాదాపూర్​/ పద్మారావునగర్​/ మలక్​పేట, వెలుగు: గ్రేటర్ వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం నుంచి దాదాపు నాలుగు గంటలపాటు వర్షం దంచికొట్టడడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై వరద ఉధృతంగా ప్రవహించడంతో బైక్​లు, కార్లు కొట్టుకుపోయాయి. ఫ్లైఓవర్లపై కూడా మోకాళ్లలోతు నీరు నిలిచింది. చాలా చోట్ల ఇండ్లలోకి  వర్షపునీరు చేరింది. ఆఫీసులు, విద్యాసంస్థలు మూసివేసే సమయానికి వాన పడడంతో ఉద్యోగులు, వద్యార్థులు ఇండ్లకు తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ప్యాట్నీ నాలా ప‌‌‌‌రిధిలో నీట మునిగిన ప్రాంతాల‌‌‌‌ను హైడ్రా క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ ఏవీ రంగ‌‌‌‌నాథ్ బోటులో తిరిగి  క్షేత్రస్థాయిలో ప‌‌‌‌రిశీలించి స‌‌‌‌హాయ‌‌‌‌క చ‌‌‌‌ర్యల‌‌‌‌ను ప‌‌‌‌ర్యవేక్షించారు. భారీ వర్షం నేపథ్యంలో హైడ్రా తొలిసారిగా ముందస్తుగా ప్రజలకు వెదర్ అలర్ట్ ఇచ్చింది. 

నిండు కుండలా హుస్సేన్ సాగర్

భారీ వర్షానికి హుస్సేన్ సాగర్​కు వరద పెరిగి, నిండు కుండలా మారింది. హుస్సేన్ సాగర్​లోకి వస్తున్న వరదను జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు 24 గంటలపాటు పరిశీలిస్తున్నారు. సాగర్ ఎఫ్టీఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా.. శుక్రవారం సాయంత్రానికి  513.38  మీటర్లకు చేరింది. వర్షం మరింత కురిస్తే హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరికలు జారీ చేసే అవకాశముంది.  

బల్దియా సైలెంట్

ఇంత భారీ వర్షం కురిసినా జీహెచ్ఎంసీ అధికారులు పత్తా లేకుండా పోయారు. అంతా హైడ్రా చూసుకుంటుందని  సైలెంట్ అయినట్లు కనిపించింది. జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్​కు వచ్చిన కాల్స్​కు కూడా హైడ్రా డీఆర్ఎఫ్​ టీమ్స్ కు సమాచారం అందిస్తామని సమాధానం ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులైతే ఫీల్డ్​లో కనిపించలేదు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మేయర్

భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సహాయక చర్యల కోసం హైడ్రా హెల్ప్ లైన్ నంబర్ 90001 13667  లేదా జీహెచ్ఎంసీ నంబర్   040–21111111 కు   కాల్  చేయాలని మేయర్‌‌‌‌ విజయలక్ష్మి సూచించారు. భారీ వర్షాలు ఉన్నాయని, అత్యవసరమైతేనే బయటకు రావాలని లేదంటే ఇంటికే పరిమితం కావాలని కోరారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మాన్సూన్ ఎమర్జెన్సీ, హైడ్రా బృందాలు ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆమె ఆదేశించారు.

ఐటీ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోమ్​

సాయంత్రం ఐటీ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సమయం కావడం.. ఇదే సమయంలో భారీ వర్షం కురవడంతో ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ స్తంభించింది.​ మెట్రో స్టేషన్లలో రద్దీ నెలకొంది. బయో డైవర్సిటీ జంక్షన్
​ప్రిస్టన్​ మాల్​వద్ద రోడ్డుపై భారీగా వర్షపునీరు చేరి కార్లు నీట మునిగాయి. ఇటీవల ప్రారంభించిన పీజేఆర్​ ఫ్లైఓవర్​పైనా కార్లు బంపర్​ టూ బంపర్​ కదిలాయి. భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ, నిపుణులు ముందస్తుగా సూచించడంతో పలు ఐటీ కంపెనీలు జాగ్రత్త పడ్డాయి. మధ్యాహ్నం 12, 3 గంటల షిఫ్టు​లకు వచ్చే ఐటీ ఉద్యోగులను కంపెనీలు ఆఫీస్​లకు రావొద్దని సమాచారం అందించాయి. ఇండ్లలో ఉండి వర్క్​ ఫ్రం హోమ్​ చేయాలని సూచించాయి.  

హెడ్డాఫీసు పరిస్థితి మరీ అధ్వానం

జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. శుక్రవారం కురిసిన వర్షానికి హెడ్ ఆఫీసులో సీలింగ్ నుంచి పిల్లర్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్​లోకి​వర్షపు నీరు చేరింది. ఇటీవల కురిసిన వర్షానికి ఇన్​వార్డు సెక్షన్​లో నీరు చేరి కంప్యూటర్లు పాడవగా, ఇప్పుడు మళ్లీ నీరు చేరడంతో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాల్ సీలింగ్ పాడవడం ఈ సమస్యకు కారణమని ఉద్యోగులు చెబుతున్నారు. పలుమార్లు మరమ్మతులు చేసినా పరిస్థితి మారకపోవడంతో హెడ్ ఆఫీసులోనే ఇలాంటి దుస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

దేవుడు కరుణించాడని పూజలు

వికారాబాద్ జిల్లా ఎల్లకొండ గ్రామంలో గత ఐదు రోజులుగా వర్షం కోసం పార్వతీ పరమేశ్వరుల ఆలయంలో గ్రామస్తులు స్వామివారికి జలాభిషేకం, ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో గ్రామస్తులు వర్షంలోనే పల్లకీ సేవ జరిపారు. అదేవిధంగా మర్పల్లి మండలం పట్లూర్ గ్రామంలోని సోమేశ్వర ఆలయంలో శివలింగానికి జలాభిషేకం చేశారు. 

వెలుగు, వికారాబాద్