
జనాభాలో అత్యధికంగా ఉన్న బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగితేనే దేశం పురోగతి సాధిస్తుందని విశ్వసించే కాంగ్రెస్ అందుకు అనుగుణంగా అడుగులేస్తోంది. అధికారంలో ఉన్న తెలంగాణలో ప్రయోగాత్మకంగా సామాజిక న్యాయం అందించిన కాంగ్రెస్ దేశానికి ఆదర్శంగా నిలిచింది.
జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో తెలంగాణలో కులగణనను విజయవంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫలితాలు బీసీలకు సంపూర్ణంగా దక్కేందుకు వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న శుభ సందర్భంలోనే దేశంలో సామాజిక న్యాయం లక్ష్యంగా బెంగళూరులో నిర్వహించిన ఏఐసీసీ ఓబీసీ జాతీయస్థాయి సలహా సమితి సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా భారత్ జోడో పాదయాత్రను నిర్వహించిన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి క్షేత్రస్థాయిలో స్థితిగతులపై పూర్తి అవగాహన ఏర్పడింది. దేశంలోని సంపద, వనరులు, విద్యా, ఉపాధి రంగాలు కొన్ని వర్గాలకే పరిమితమవుతున్నాయని, 90 శాతానికి న్యాయం జరగడంలేదని గుర్తించిన రాహుల్ గాంధీ సామాజిక న్యాయానికి దేశవ్యాప్తంగా కులగణన కోసం డిమాండ్ చేశారు.
2021లో ఢిల్లీలో సమృద్ధ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ ఓబీసీ సమావేశంలో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు పాల్గొని సామాజిక న్యాయం కోసం కులగణన, రిజర్వేషన్లపై సమగ్రంగా చర్చించి ‘ఢిల్లీ డిక్లరేషన్’ ప్రకటించగా, కాంగ్రెస్ మద్దతిచ్చింది. దీనికి అనుగుణంగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ సూచనల మేరకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ఇచ్చిన హామీకి కట్టుబడి కులగణన పూర్తి చేయడం దేశ చరిత్రలో కీలక మలుపు.
సామాజిక న్యాయానికి ప్రాధాన్యం
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 2025 ఫిబ్రవరిలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభలో మాట్లాడుతూ ‘తెలంగాణలో సుమారు 90 శాతం దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, ఓబీసీ వర్గాలున్నట్లు కులగణనలో తేలింది, దేశంలోనూ ఇదే పరిస్థితి ఉందని నమ్ముతున్నాను. దేశంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా అందరికీ భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉంది.
కులగణన చేస్తే దేశంలోని 90 శాతం జనాభా సంపద, శక్తి ఎవరి వద్ద ఉందో తెలుస్తుంది.’ అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఎంత ప్రాధాన్యతనిస్తుందో ఈ వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో కులగణన నివేదికను విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే డిమాండ్ పెరిగింది.
పార్లమెంట్‌తోపాటు వీలైనన్ని వేదికల ద్వారా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గిన బీజేపీ ప్రభుత్వం దేశంలో కులగణనకు అంగీకరించింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌తోపాటు తెలంగాణలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు పేద, బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు న్యాయం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు పగ్గాలు చేపట్టిన మూడు నెలల్లోపే కులగణన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
కులగణనతో వాస్తవాలు
కులగణనకు రూ.160 కోట్లను కేటాయించిన ప్రభుత్వం అధికారికంగా 2024 ఫిబ్రవరి 4వ తేదీన సర్వే ప్రక్రియ ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో 2024 నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు నిర్వహించి, అనుకోని కారణాలతో నమోదు చేసుకోలేకపోయినవారందరికీ మరో అవకాశం కల్పించింది. ప్రభుత్వ కులగణన వివరాల ప్రకారం తెలంగాణలో బీసీలు 46 శాతంపైగా, ఎస్సీలు 17 శాతంపైగా, ఓసీలు 13 శాతంపైగా, ముస్లింలు 12 శాతం పైగా, ఎస్టీలు 10 శాతం పైగా ఉన్నారు.
ముస్లింలోని 10 శాతం పైగా ఉన్న బీసీలను కూడా కలిపితే మొత్తం బీసీల సంఖ్య 56 శాతం దాటుతోంది. ముస్లింలోని 2 శాతానికిపైగా ఉన్న ఓసీలను కలిపితే మొత్తం ఓసీల సంఖ్య 15 శాతం దాటుతోంది. శాస్త్రీయబద్ధంగా నిర్వహించిన ఈ సర్వే గణాంకాలను పరిశీలిస్తే జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు సమన్యాయం జరగడం లేదని స్పష్టమవుతోంది.
ప్రభుత్వం చేసిన కులగణనతో వాస్తవ పరిస్థితులు బహిర్గతం కావడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బెంబేలెత్తి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. కులగణన లెక్కలు తప్పంటూ బీఆర్ఎస్, బీసీల్లో ముస్లింలను చేర్చారంటూ బీజేపీ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
బీఆర్ఎస్ విమర్శలు హాస్యాస్పదం
2014లో రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన బీఆర్ఎస్ అధికారికంగా వివరాలను ప్రకటించకుండా కాంగ్రెస్‌ను విమర్శించడం హాస్యాస్పదం. గుజరాత్లో ముస్లింలు బీసీల్లో ఉంటే మాట్లాడని జాతీయపార్టీ బీజేపీ తెలంగాణలో భావోద్వేగాలను రెచ్చగొడుతోంది.
ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలకు పాల్పడినా కాంగ్రెస్ వెనకడుగు వేయలేదు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం కల్పిస్తూ రిజర్వేషన్లను జనాభా ఆధారంగా చేపట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన నిర్వహించి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు ప్రకటించింది.
56 శాతానికిపైగా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరిగేందుకు విద్య, ఉపాధి, స్థానిక ఎన్నికల్లో వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి చట్టబద్ధత కల్పించేందుకు 9వ షెడ్యుల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా సానుకూల స్పందన లేదు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకుతెలంగాణలో స్థానిక ఎన్నికలు త్వరలో నిర్వహించాల్సిన నేపథ్యంలో.. బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా అన్యాయం జరగకూడదనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి నిబద్ధతను నిరూపించుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మార్గదర్శకంలో ఎంతో పట్టుదలగా కులగణన, బీసీ రిజర్వేషన్ల ఘట్టాలను సీఎం రేవంత్ రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు.
బీసీలకు న్యాయం
బీసీలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి. ఈ ఆర్డినెన్స్ న్యాయస్థానం ముందు నిలబడదంటూ బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేయాలని చూస్తోంది. గతంలో స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 34 నుంచి 23 శాతానికి తగ్గించిన బీఆర్ఎస్కు బీసీలపై మాట్లాడే హక్కే లేదు. బిల్లుకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేని రాష్ట్ర బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం విడ్డూరం.
రాహుల్ గాంధీ కల సాకారం
విద్య, ఉద్యోగ, రాజకీయాలతోపాటు అన్ని రంగాల్లో ఓబీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని, ఆర్టికల్ 15(5) ప్రకారం ప్రయివేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని బెంగళూరు డిక్లరేషన్లో తీర్మానించారు. రాబోయే అక్టోబర్లో ఏఐసీసీ ఓబీసీ సలహామండలి సమావేశాలు హైదరాబాదులో నిర్వహించాలని బెంగళూరు సమావేశంలో నిర్ణయించడంతో తెలంగాణ కాంగ్రెస్ పై సామాజిక న్యాయం బాధ్యత మరింత పెరిగింది.
జనాభా పరంగా ‘ఎవరెంతో వారికంత’ న్యాయం జరగాలనే లక్ష్యంతో బడుగు బలహీన, మైనార్టీ వర్గాల సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న రాహుల్ గాంధీ కలలను నిజం చేసిన తెలంగాణ కాంగ్రెస్ కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో దేశానికే ఆదర్శంగా నిలిచింది. చరిత్రాత్మకమైన ఈ రెండు నిర్ణయాలు వ్యక్తిగతంగా నా జీవితంలో చిరకాలం గుర్తుండిపోయేవి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నాకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం దక్కింది. నేను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణలో కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు నిర్ణయం తీసుకోవడం నా జీవితంలో సువర్ణాధ్యాయంగా భావిస్తున్నాను.
ప్రతిపక్షాలు రాజకీయాలే లక్ష్యంగా కాంగ్రెస్ ను విమర్శిస్తుంటే, దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. రాహుల్ గాంధీ ఒత్తిడితో దేశంలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలయాపన చేయకుండా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ బెంగళూరులో జులై 15, 16 తేదీల్లో ఏఐసీసీ ఓబీసీ సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి విలువైన సూచనలు చేసింది. తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను కేంద్రం మోడలుగా తీసుకొని దేశంలో కులగణన చేయాలని సమావేశంలో తీర్మానించారు.
- బి. మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు–