లిక్క‌ర్ రేటు 70 % పెరిగినా ప‌ర్లేదు.. దేశానికి డొనేష‌న్ అనుకుంటాం

లిక్క‌ర్ రేటు 70 % పెరిగినా ప‌ర్లేదు.. దేశానికి డొనేష‌న్ అనుకుంటాం

క‌రోనా లాక్ డౌన్ తో దాదాపు 40 రోజుల పైగా లిక్క‌ర్ షాపులు మూత‌ప‌డ్డాయి. మ‌ళ్లీ ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని ఎదురు చూసిన మ‌ద్యం ప్రియుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. మే 4 నుంచి లిక్క‌ర్ షాపులు తెరిచేందుకు అనుమ‌తి ఇచ్చింది. దీంతో ఆనందం వ్య‌క్తం చేసిన లిక్క‌ర్ ల‌వ‌ర్స్ కి ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు భారీగా మ‌ద్యం రేట్లు పెంచుతూ షాక్ ఇచ్చాయి. ఢిల్లీ స‌ర్కార్ అయితే ఏకంగా 70 శాతం రేట్లు పెంచింది. అయితే దీనికి తామేం బాధ‌ప‌డ‌డం లేద‌ని చెబుతున్నారు ఢిల్లీకి చెందిన ఓ వ్య‌క్తి. లిక్క‌ర్ పై అద‌నంగా వ‌సూలు చేస్తున్న 70 శాతం ట్యాక్స్ ను ఈ క‌ష్ట కాలంలో దేశానికి తాము ఇస్తున్న డొనేష‌న్ అనుకుంటామ‌ని అన్నాడు.

గుంపులను కంట్రోల్ చేయ‌లేక‌పోవ‌డంపై అసంతృప్తి

దాదాపు 40 రోజుల త‌ర్వాత లిక్క‌ర్ షాపులు ఓపెన్ కావ‌డంతో ఇన్ని రోజులుగా మందుకు దూరంగా ఉన్న వాళ్లంతా ఒక్క సారిగా వందల సంఖ్య‌లో మ‌ద్యం దుకాణాల‌కు క్యూ క‌ట్టారు. సోష‌ల్ డిస్టెన్ పాటించాల‌న్న నిబంధ‌న‌లు గాలికి వ‌దిలేసి షాపుల ద‌గ్గ‌ర ఒక‌రినొక‌రు తోసుకుంటూ నిల‌బ‌డ్డారు. అయితే షాపుల ద‌గ్గ‌ర జ‌నాన్ని కంట్రోల్ చేయ‌డంలో పోలీసులు విఫ‌ల‌మ‌య్యార‌ని ఓ మ‌ద్యం ప్రియుడు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఢిల్లీలోని ల‌క్ష్మీ న‌గ‌ర్ లోని ఓ లిక్క‌ర్ షాపు ద‌గ్గ‌ర క్యూలో నిల్చున్న ఓ వ్య‌క్తి తాను ఉద‌యం ఆరు గంట‌ల‌కే వ‌చ్చాన‌ని, కానీ షాపులు 9 గంట‌ల‌కు తెరుస్తార‌నగా దానికి ఐదు నిమిషాల ముందు మాత్ర‌మే పోలీసులు వ‌చ్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అస‌లు జ‌నాన్ని కంట్రోల్ చేయ‌డంలో జ‌వాబుదారీ ఎవ‌ర‌ని ప్ర‌శ్నించాడ‌త‌ను. ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశ‌మంతా కూడా ఈ వ్య‌వ‌స్థ‌ను క‌ట్టుదిట్టంగా చూసుకోవాల్సిన బాధ్య‌త ఎవ‌రిదంటూ అడిగాడు. అక్క‌డ భారీగా గుంపుగా చేరిన జ‌నంలో ఎవ‌రికైనా దుర‌దృష్టవ‌శాత్తు ఏదైనా జ‌రిగితే ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.