ప్రజాభవన్లో కేసీఆర్ నేమ్ ప్లేట్పై బురద.. కాంగ్రెస్ కార్యకర్త తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం

ప్రజాభవన్లో కేసీఆర్ నేమ్ ప్లేట్పై బురద.. కాంగ్రెస్ కార్యకర్త తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 8) ప్రజాభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను సీఎం స్వీకరించి పరిశీలించారు. వారి సమస్యలను రేవంత్‌ అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

వివిధ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజాభవన్ కు తరలివచ్చారు. కొంతమంది ప్రజాభవన్ లోని వివిధ చోట్ల ఫొటోలు దిగారు. సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. ప్రజాభవన్ లోనే ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందు వరకు కేసీఆర్ ఫ్యామిలీ ఉండేది. ప్రజా భవన్ లోని ఒక బిల్డింగుకు కేసీఆర్ పేరుతో ఒక నేమ్ ప్లేట్ ఉంది. 

అయితే.. కేసీఆర్ నేమ్ ప్లేట్ పై గుర్తు తలియని వ్యక్తి ఒకరు మట్టి (బురద) రుద్దారు. కేవలం కేసీఆర్ పేరు ఉన్న దగ్గర మాత్రమే బురద చల్లాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే.. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్విట్టర్ లో స్పందించారు. కేసీఆర్ పేరుపై కాంగ్రెస్ నాయకుడు ఒకరు బురద చల్లాడని, మెడలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్న వ్యక్తి ఫొటోను కూడా క్రిశాంక్ ట్విట్టర్ లో షేర్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడి పట్ల ఇలాగేనా వ్యహరించేది అని ట్విట్టర్ లో ప్రశ్నించారు క్రిశాంక్. 

“కేసీఆర్ గారి పేరును బురదతో కొట్టి తెలంగాణ చరిత్ర నుండి ఆయన పేరును తుడిచివేయలేము. కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయాలని భావిస్తే కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రతి కలెక్టర్ ఆఫీసు, ప్రతి కమిషనరేట్, ప్రతి పాఠశాల, హాస్పిటల్, లైబ్రరీ పట్ల ఇలాగే వ్యవహరిస్తారా..? " అని క్రిశాంక్ తన X పోస్ట్‌లో  ప్రశ్నించారు. 

మరోవైపు.. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఉన్నతాధికారులు ప్రజాభవన్ లోని నేమ్ ప్లేట్ ను ఎందుకు తొలగించలేదు..? ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో మరో నేమ్ ప్లేట్ ఎందుకు ఏర్పాటు చేయలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.