సికింద్రాబాద్‌లోని ఓ బైక్‌ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌లోని ఓ బైక్‌ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రికల్‌ బైక్‌ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో బైక్‌ షోరూం పైనే ఉన్న లాడ్జిపైకి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. లాడ్జిలో దట్టమైన పొగలు అలుముకోవడంతో అందులో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లాడ్జిలో ఉన్న చాలామంది టూరిస్టులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కిటికీల నుంచి కిందకు దూకారు. మరికొంతమందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైరింజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.

అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదు మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మంటల్లో గాయపడిన వారిని స్థానికంగా ఉన్న సికింద్రాబాద్ గాంధీ, యశోద ఆస్పత్రులకు తరలించారు. 

అగ్ని ప్రమాదంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. సెల్లార్ లో ఎలక్ర్టిక్ బ్యాటరీ బైకులు అంటుకునే మంటలు ఎగిసిపడ్డాయని తెలుస్తోంది. దట్టమైన పొగలతో రెస్క్యూ ఆపరేషన్ కు చాలా ఇబ్బందులు తలెత్తాయి. రూబీ ఎలక్ట్రికల్‌ బైక్‌ షోరూమ్‌.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లే దారిలో ఉంటుంది. నాలుగు ఫ్లోర్లలో రూబీ లాడ్జి, హోటల్ ఉంది. లాడ్జిలో పలువురు చిక్కుకుని ఉన్నట్లు సమాచారం అందుతోంది. హైడ్రాలిక్ క్రేన్, నిచ్చెన సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 

ఘటనా స్థలానికి వెళ్లిన తలసాని 
విషయం తెలియగానే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రిక్ బ్యాటరీ షోరూమ్ లో ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మరోవైపు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, నార్ట్ జోన్ డీసీపీ చందనా దీప్తి కూడా  ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదంపై ఆరా తీశారు.