ఎన్​కౌంటర్‌లో మిలీషియా కమాండర్​ మృతి

ఎన్​కౌంటర్‌లో మిలీషియా కమాండర్​ మృతి

 భద్రాచలం, వెలుగు : చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజా పూర్​ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్​కౌంటర్​లో మావోయిస్టు మిలీషియా కమాండర్​ గుడ్డి కవాసి మృతి చెందాడు. బైరంగఢ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని కేశ్​కుతుల్​-కేశముండి అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో డీఆర్​జీ బలగాలు కూంబింగ్​ చేపట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. 

కాల్పులు ఆగిపోయాక వెళ్లి చూడగా గుడ్డి కవాసిమృతదేహంతో పాటు దేశీయ తుపాకీ, కుక్కర్ బాంబు, కార్డెక్స్ వైర్, ఫ్యూజ్, డిటోనేటర్​, జిలిటిన్​స్టిక్, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులు దొరికాయి. కవాసీపై లక్ష రూపాయల రివార్డు ఉంది. అనేక హత్యలతో పాటు బాంబులు అమర్చిన ఘటనల్లో ప్రధాన నిందితుడిగా ఆయనపై పలు పోలీస్​స్టేషన్లలో కేసులు ఉన్నాయి.

మావోయిస్టు మిలీషియా సభ్యుల లొంగుబాటు

భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్​ఎదుట ఆదివారం ఆరుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఏరియా కమిటీ, చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని కిష్టారం ఏరియా కమిటీల సాయుధ దళ సభ్యులతో కలిసి పనిచేస్తున్న రవ్వ సన్న(డోకుపాడు), ముసికి సన్న(డోకుపాడు), మడకం జోగా(డోకుపాడు), కొవ్వాసి మంగ( డోకుపాడు), రవ్వ లక్కు(డోకుపాడు), మిలీషియా డిప్యూటీ కమాండర్​కర్ణం పొజ్జా(పుట్టపాడు) పలు విధ్వంసకర సంఘటనలు, మందుపాతరలు అమర్చిన ఘటనల్లో కీలకంగా వ్యవహరించారు.

 తెలంగాణ చత్తీస్​గఢ్​ రాష్ట్రాల సరిహద్దుల్లోని డోకుపాడు, పుట్టపాడు గ్రామాల నుంచి సీఆర్​పీఎఫ్-141 బెటాలియన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు వీరి కుటుంబసభ్యులను కలిసి జనజీవన స్రవంతిలో కలిసేలా చూడాలని పలుమార్లు చర్చించారు. జీవనోపాధి, పునరావాసం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో లొంగిపోయారు. ఏఎస్పీ పంకజ్​పరితోష్, 141 సీఆర్​పీఎఫ్ ​బెటాలియన్ కమాండెంట్ రితేశ్​ఠాకూర్, సెకండ్ ఇన్​ కమాండెంట్ కమల్ వీర్​యాదవ్, అసిస్టెంట్ కమాండెంట్ రేవతి అర్జున్, దుమ్ముగూడెం, చర్ల సీఐలు అశోక్​, రాజువర్మ, దుమ్ముగూడెం ఎస్సై గణేశ్​ పాల్గొన్నారు.