అడవిలో కూలిన విమానం..17 రోజులైనా బతికిన్రు

అడవిలో కూలిన విమానం..17 రోజులైనా బతికిన్రు

బొగోటా : కొలంబియా దేశం పరిధిలోని అమెజాన్ అడవుల్లో అద్భుతం చోటుచేసుకుంది. 17 రోజుల కిందట జరిగిన విమాన ప్రమాదం నుంచి నలుగురు చిన్నారులు బతికిబయటపడ్డారు. వారిలో 11 నెలల పసిబిడ్డ కూడా ఉంది. ఈ నెల 1న అమెజానాస్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అరరాక్యూరా నుంచి శాన్ జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి సెస్నా 206 అనే చిన్న విమానం బయలుదేరింది. అందులో పైలెట్ తోపాటు ఓ మహిళ, ఆమె 11 నెలల చంటిబిడ్డతో సహా నలుగురు పిల్లలు, మరో వ్యక్తి ఉన్నారు. అయితే, ప్లేన్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. విమానం కుప్పకూలింది.

అధికారులు ‘ఆపరేషన్ హోప్’ పేరిట రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో  పైలెట్, మహిళ, వ్యక్తి డెడ్ బాడీలను గుర్తించారు. అయితే, వారితోపాటు ప్రయాణించిన 11 నెలల చిన్నారి, 4, 9, 13 ఏండ్ల పిల్లలు కనిపించలేదు. దాంతో అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. వివిధ వస్తువుల ఆధారంగా చిన్నారులు సజీవంగానే ఉన్నారని.. అడవిలోనే సంచరిస్తున్నారని తెలుసుకున్నారు. ఎటువెళ్లాలో తెలియక చిన్నారులు అక్కడక్కడే తిరుగుతున్నట్లు గుర్తించి వెతకగా..గురువారం వారి జాడను కనిపెట్టారు. ప్రస్తుతం నలుగురు చిన్నారులు క్షేమంగా ఉన్నారు. దీనిపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఆనందం వ్యక్తం చేశారు. అనేక ఆటంకాలను ఎదుర్కొని పిల్లల జాడను గుర్తించినట్లు చెప్పారు. అయితే, పిల్లలు అడవిలో అన్నిరోజులు ఎలా సురక్షితంగా ఉన్నారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదని గుస్తావో పెట్రో తెలిపారు. అలాగే విమానం క్రాష్​ అవ్వడానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.