చిన్నశంకరంపేట, వెలుగు: అత్తామామ వేధింపులు తాళలేక ఓ వివాహిత తన రెండేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన తాళ్ల అఖిల(23) భర్త ప్రవీణ్‌గౌడ్ ఏడు నెలల క్రితం మృతిచెందాడు. ఆమెకు రెండేళ్ల కొడుకు రియాన్ష్ గౌడ్ ఉన్నాడు. భర్త చనిపోయినప్పటి నుంచి అత్తామామలు అఖిలను పుట్టింటికి వెళ్లిపోవాలని, రియాన్ష్‌ను తమ వద్దే ఉంచాలని ఒత్తిడి తెస్తున్నారు.
దీంతో కొద్ది రోజుల క్రితం అఖిల సంకాపూర్లోని తల్లిగారింటికి వెళ్లింది. తిరిగి ఆదివారం ఖాజాపూర్ గ్రామంలోని అత్తవారింటికి వచ్చింది. అయినా అత్తామామల నుంచి వేధింపులు ఆగకపోవడంతో మనస్తాపానికి గురైంది. మంగళవారం ఉదయం కొడుకు రియాన్స్‌కు ఉరి వేసి చంపి, వెంటనే తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అఖిల తండ్రి ఫిర్యాదుతో అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నారాయణ తెలిపారు.
