వర్సిటీల ఎగ్జిక్యూటీవ్ కమిటీలపై కొత్త వివాదం

వర్సిటీల ఎగ్జిక్యూటీవ్ కమిటీలపై కొత్త వివాదం
  • ఫిబ్రవరిలోనే ముగిసిన 9 యూనివర్సిటీల ఈసీల గడువు 

హైదరాబాద్, వెలుగు: స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్​లో కొత్త లొల్లి మొదలైంది. తెలంగాణ యూనివర్సిటీ వివాదం ముగిసిందనుకునే లోపే.. వర్సిటీల ఎగ్జిక్యూటీవ్ కమిటీల(ఈసీ) గడువుపై వివాదం తలెత్తింది. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఈసీ మినహా.. మిగిలిన 9 వర్సిటీల ఈసీల కాలపరిమితి పూర్తయింది. అయినా అవే కమిటీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే, ఆ కమిటీలు తీసుకునే నిర్ణయాలు చెల్లుతాయా? లేదా? అనే దానిపై అందరిలో అయోమయం మొదలైంది. 

కమిటీ గడువు మూడేండ్లు.. 

రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన మహిళా యూనివర్సిటీతో కలిపి 12 వర్సిటీలు ఉన్నాయి. దీంట్లో ఆర్జీయూకేటీ (బాసర ట్రిపుల్ ఐటీ)కి ప్రత్యేక ఈసీ ఉండగా, మహిళా యూనివర్సిటీ కొత్తగా వచ్చింది. ఇగ మిగిలిన పది యూనివర్సిటీల్లో తెలుగు యూనివర్సిటీ ఈసీ గడువు.. ఈ ఏడాది డిసెంబర్ 30 వరకు ఉంది. కాకతీయ యూనివర్సిటీ ఈసీ కాలపరిమితి గతేడాది అక్టోబర్ 11తోనే పూర్తయింది. మిగిలిన ఉస్మానియా వర్సిటీతో పాటు మహ్మాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు వర్సిటీ, జేఎన్టీయూ, జేఎన్​ఏఎఫ్​ఏయూ ఎగ్జిక్యూటీవ్ కమిటీల గడువు ఫిబ్రవరి 27తోనే ముగియగా.. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈసీ గడువు మార్చి18తో పూర్తయింది. అయినా యూనివర్సిటీలు పాత కమిటీలనే కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం వివాదాలకు బిందువైన తెలంగాణ వర్సిటీ ఈసీ సమావేశాలు పలుమార్లు జరిగాయి. దీంట్లో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

ఇవన్నీ చెల్లుబాటు అవుతాయా? లేదా? అనే దానిపై చర్చ మొదలైంది. కాగా, యూనివర్సిటీల యాక్ట్ 1991 ప్రకారం ఈసీ గడువు మూడేండ్లే. ఆ తర్వాత కొత్త కమిటీని నియమించాల్సి ఉంటుంది. కమిటీలోని ఎక్స్ ఆఫిషియో మెంబర్లు (సర్కార్ నామినేట్ చేసే వాళ్లు.. విద్యాశాఖ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ) మాత్రం కొనసాగడానికి వీలుంటుంది. మిగిలిన మెంబర్లు మాత్రం కొనసాగడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు అన్ని వర్సిటీల్లో పాత కమిటీలోని సభ్యులందరితో సమావేశాలు నిర్వహిస్తుండడం 
చర్చనీయాంశంగా మారింది. 

ఆలస్యంగా మేల్కొన్న విద్యాశాఖ.. 

ఈసీల గడువు ముగిసి చాలా రోజులైనా కొత్త కమిటీలు వేసే ఆలోచన విద్యాశాఖ చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈసీల కాలపరిమితి పూర్తయిందని, క్లాస్ 2 కేటగిరీలో మెంబర్లను నామినేట్ చేసేందుకు ప్రతిపాదనలు తీసుకోవాలని మే30న హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ కు విద్యాశాఖ సెక్రటరీ లేఖ రాశారు. దీంతో ప్రతిపాదనలు పంపించాలని ఈ నెల 16న అన్ని వర్సిటీల రిజిస్ర్టార్లకు కౌన్సిల్ సెక్రటరీ లేఖ రాశారు. ఒక్కో విభాగంలో ముగ్గురి పేర్లను ఈ నెల 20లోపే పంపంచాలని అందులో పేర్కొన్నారు. కానీ, గడువు ముగిసినా ఇంకా సగం వర్సిటీల నుంచి కూడా ప్రపోజల్స్ రాలేదు. దీంతో మరోసారి లేఖ రాయాలని భావిస్తున్నారు. కాగా, కొత్తగా ఏర్పడిన మహిళా యూనివర్సిటీకీ ఈసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వర్సిటీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను కౌన్సిల్ అధికారులు సర్కారుకు పంపించనున్నారు. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోనున్నది.