అందాల కిరీటం ఎవరికో? మిస్​ వరల్డ్ గ్రాండ్​ ఫినాలే.. హైటెక్స్లో వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

అందాల కిరీటం ఎవరికో? మిస్​ వరల్డ్ గ్రాండ్​ ఫినాలే.. హైటెక్స్లో వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
  • క్వార్టర్​ఫైనల్కు 40 మంది ఎంపిక
  • మిస్ ఇండియా నందిని గుప్తాకు చోటు
  • విజేతకు సీఎం చేతుల మీదుగా కిరీటం 
  • జడ్జిలుగా సోనుసూద్​, సుధారెడ్డి, 
  • మిస్ ఇంగ్లాండ్ కారినా టర్రెల్ 
  • సోనుసూద్‌కు హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం
  • స్పెషల్​ అట్రాక్షన్​గా నిలువనున్న 2017 విజేత మానుషి చిల్లర్

హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్–​2025 పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌‌‌‌లో శనివారం సాయంత్రం 6:30 గంటలకు మిస్​వరల్డ్​ గ్రాండ్​ఫినాలే ప్రారంభం కానున్నది.  ఫినాలే కార్యక్రమానికి మిస్ వరల్డ్ –2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్​ వేదికపై లైవ్ షో ఇవ్వనున్నారు.

కాగా, క్వార్టర్​ ఫైనల్ లో 40 మందికి చోటు లభించగా.. ఇందులో మిస్​ ఇండియా నందిని గుప్తా ఉండటం విశేషం. మిస్​ వరల్డ్​ 72వ ఎడిషన్​లో  108 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు.   సుమారు 20 రోజులపాటు జరిగిన వివిధ ఈవెంట్లలో  ముద్దుగుమ్మలు పాల్గొని, తమ ప్రతిభను చాటారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించి ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే నినాదాన్ని విశ్వవ్యాప్తం చేశారు. 

సోనూసూద్కు అవార్డు
ప్రముఖ మానవతావాది, నటుడు సోనూ సూద్‌‌‌‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఆయన మిస్​వరల్డ్​ గ్రాండ్​ ఫినాలేకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. సుధాకర్​రెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ –2014), మిస్ వరల్డ్ సీఈవో  జూలియా మోర్లీ జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. మిస్ వరల్డ్–2017 విజేత,  బాలీవుడ్ నటి మనూషి చిల్లర్ ఈ ఈవెంట్​లో స్పెషల్​ అట్రాక్షన్​గా నిలువనున్నారు.  గ్రాండ్ ఫినాలే కార్యక్రమం దేశంలో సోనీలివ్‌‌‌‌లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. మిస్ వరల్డ్ యూ ట్యూబ్ చానెల్ లోనూ వీక్షించవచ్చు. కొన్ని దేశాల్లో జాతీయ టెలివిజన్‌‌‌‌ చానల్స్​ లో ప్రసారం కానున్నది. ప్రపంచవ్యాప్తంగా www.watchmissworld.com ద్వారా హైడెఫినిషన్‌‌‌‌లో అందుబాటులో ఉంటుంది.
  
40 మంది క్వార్టర్ ఫైనల్స్కు..
108 మంది పోటీదారుల్లో  ప్రతీ ఖండం (అమెరికా అండ్ కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా అండ్​ ఓషియానియా) నుంచి 10 మంది సెమీఫైనలిస్టులు.. మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్ కు చేరుతారు. కొందరు పోటీదారులు ఫాస్ట్-ట్రాక్ చాలెంజ్‌‌‌‌ల ద్వారా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌‌‌‌ కు చేరుకున్నారు.  వారి వివరాలు ఇలా ఉన్నాయి..

  • అమెరికా అండ్​ కరీబియన్ :  హెడ్ టు హెడ్ చాలెంజ్ ద్వారా అన్నాలిసే నాంటన్ (ట్రినిటాడ్ అండ్​ టొబాగో), టాప్ మోడల్ ద్వారా ఆరెలీ జోకిమ్ (మార్టినిక్), బ్యూటీ విత్ ఏ పర్పస్ ద్వారా వలెరియా పెరెజ్ (ప్యూర్టోరికో), మల్టీ మీడియా అవార్డు ద్వారా మైరా డెల్గాడో (డొమినికన్ రిపబ్లిక్)
  • ఆఫ్రికా:  హెడ్ టూ హెడ్ చాలెంజ్ ద్వారా ఫైత్ బ్వాల్యా (జాంబియా), టాప్ మోడల్ ద్వారా  సెల్మా కమన్య (నమీబియా), బ్యూటీ విత్ ఏ పర్పస్ ద్వారా నటాషా న్యోన్యోజి (ఉగాండా), మల్టీ మీడియా అవార్డు ద్వారా  ప్రిన్సెస్ ఇస్సీ (కామెరూన్)
  •  యూరప్ : స్పోర్ట్స్​ చాలెంజ్ ద్వారా ఎలిసే రండ్మా (ఎస్తోనియా), హెడ్ టు హెడ్ చాలెంజ్ తోపాటు బ్యూటీ విత్ ఏ పర్పస్ ద్వారా మిల్లీ మే ఆడమ్స్ (వేల్స్), టాప్ మోడల్ ద్వారా జాస్మిన్ గెర్హార్డ్ట్ (ఐర్లాండ్), మల్టీ మీడియా అవార్డ్ ద్వారా ఆండ్రియా నికోలిచ్ (మాంటెనెగ్రో)
  • ఆసియా అండ్​ ఓషియానియా : టాలెంట్ అండ్ బ్యూటీ విత్ ఏ పర్పస్ ద్వారా మోనికా కెజియా సెంబిరింగ్ (ఇండోనేషియా), హెడ్ టు హెడ్ చాలెంజ్ ద్వారా ఇడిల్ బిల్గెన్ (టర్కీ), టాప్ మోడల్ ద్వారా నందిని గుప్తా (ఇండియా), మల్టీ మీడియా అవార్డు ద్వారా  ఓపల్ సుచాతా (థాయిలాండ్) 

జడ్జిల ప్యానెల్ ద్వారా మరికొందరి ఎంపిక
మిగిలిన సెమీఫైనలిస్టులను వ్యక్తిగత ఇంటర్వ్యూల తర్వాత న్యాయనిర్ణేతల ప్యానెల్ ద్వారా ఎంపిక చేస్తారు. ఫైనల్ షో సమయంలో వారి వివరాలు వెల్లడిస్తారు. క్వార్టర్ ఫైనల్స్ లో ప్రతీ ఖండం నుంచి టాప్ –5, ఆ తర్వాత టాప్ 2, చివరిగా 4వ ఖండ విజేతలు ఎంపికవుతారు. వారు చివరి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా కొత్త మిస్ వరల్డ్ ఎన్నికవుతుంది. విజేతకు  ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా (71వ మిస్ వరల్డ్)  కిరీటం అందజేస్తారు.   

కలర్​ ఫుల్​ హోర్డింగ్స్​
తెలంగాణ సంస్కృతి, పర్యాటక ప్రాంతాల ప్రాధాన్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు భారీగా కలర్​ ఫుల్​ హోర్డింగ్​లు  ఏర్పాటు చేశారు. పలు దేశాలకు తెలంగాణ పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపేలా డిజిటల్​ బోర్డులు అమర్చారు. పలు సిటీల్లో రద్దీ ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్​తో  ‘తెలంగాణ జరూర్ ఆనా’  అనే నినాదం దేశవిదేశాల్లో ప్రతిధ్వనిస్తున్నది. 

సీఎం రేవంత్​రెడ్డి చేతుల మీదుగా..
హైటెక్స్​లో జరిగే మిస్​ వరల్డ్​ గ్రాండ్​ ఫినాలే వేడుకలకు సీఎం రేవంత్​ రెడ్డి ముఖ్య​అతిథిగా హాజరు కానున్నారు. ఆయనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు విచ్చేస్తారు. విశ్వసుందరికి సీఎం రేవంత్​ రెడ్డి చేతుల మీదుగా కిరీటం అందజేయనున్నారు.  ఈ ఈవెంట్​లో 108 దేశాల కంటెస్టెంట్స్, విదేశీ మీడియా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, టాలీవుడ్, బాలీవుడ్​సినీ ప్రముఖలు, రాజకీయ నేతలు పాల్గొననుండటంతో హైటెక్స్​ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటీవలి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి పొరపాట్లకు తావివ్వికుండా చర్యలు చేపడుతున్నారు.  అధికారుల సమన్వయం కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌‌‌‌ రూం ఏర్పాటు చేశారు. ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు.  

లండన్ కోర్టులో మిల్లా మాగీపై కేసు: జయేశ్
మిస్​ ఇంగ్లండ్​ మిల్లా మాగీపై లండన్​ కోర్టులో కేసు వేసినట్టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్​ రంజన్ తెలిపారు.  ఆమె తన సొంత దేశంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్​ వరల్డ్​–2025 పోటీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారని చెప్పారు. మాగీపై యూకే ప్రభుత్వం లీగల్​ గా చర్యలు తీసుకోబోతున్నదని అన్నారు. కాంట్రవర్షల్ కామెంట్స్ చేసిన మాగీపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విచారణ ముగిసిందని, ఆమెపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోదని తెలిపారు.

గ్రాండ్​ ఫినాలే పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.108 మంది కంటెస్టెంట్స్ లలో 40 మంది క్వార్టర్​ఫైనల్ కు చేరుకున్నారని తెలిపారు. 3,500 మందికి మిస్ వరల్డ్ పోటీలను తిలకించే అవకాశం కల్పించామని చెప్పారు.  టూరిజం వెబ్ సైట్ ద్వారా ఫైనల్ పోటీలు వీక్షించేందుకు వెయ్యి  మంది సామాన్యులకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. . శనివారం సెమీ ఫైనల్ అండ్ ఫైనల్ పోటీలు జరుగుతాయని, రాత్రి 9 గంటలకు విజేతగా నిలిచిన విశ్వసుందరికి మిస్ వరల్డ్ కిరీటాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారని చెప్పారు. జూన్​ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని  రాజ్ భవన్ లో తేనీటి విందు ఉంటుందని, ఇందులో  మిస్​ వరల్డ్ విజేత పాల్గొంటారని తెలిపారు.