ఊదా టమాటాకు.. ఊ చెప్పిన అమెరికా

ఊదా టమాటాకు.. ఊ చెప్పిన అమెరికా

అవి చూడటానికి అచ్చం వంకాయల్లా ఉంటాయి. కానీ వంకాయలు కావు.. అవి టమాటాలు. సాధారణ టమాటాకు జన్యుమార్పిడి చేయడం వల్ల ఈ ఊదారంగు టమాటాలు పుట్టుకొచ్చాయి. వీటి సాగుకు తాజాగా సెప్టెంబరు 17న అమెరికా పచ్చజెండా ఊపింది.  వచ్చే ఏడాది నుంచి ఈ పంటను దేశంలో పండించవచ్చని  అమెరికా వ్యవసాయ శాఖ ప్రకటించింది. వాస్తవానికి ఈ జన్యుమార్పిడి ఊదా టమాటాను 2008లోనే అభివృద్ధి చేశారు. అయితే దానికి తమ దేశంలో సాగు అనుమతులు ఇచ్చేందుకు అప్పట్లో అమెరికా నిరాకరించింది. 14 ఏండ్ల తర్వాత ఎట్టకేలకు ఊదా టమాటా సాగుకు ఊ కొట్టింది. క్యాన్సర్, హృద్రోగాలకు చెక్ పెట్టే విశిష్ట ఔషధ గుణాలు కలిగిన ఈ వెరైటీ ఊదా టమాటా పై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.  

ఎలా అభివృద్ధి చేశారు ? 

ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్‌ దేశాల సైంటిస్టులు సంయుక్తంగా పరిశోధనలు చేసి 2008లో ఊదా టమాటాలను అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణకు ఇంగ్లండ్ లోని సైన్స్ బరీ లేబొరేటరీ వేదికగా నిలిచింది. సాధారణ టమాటాలలోకి డ్రాగన్‌ పుష్పాలు, డ్రాగన్ పూలు, డాగ్ పూల జీన్స్‌ ను ప్రవేశపెట్టి ఊదా టమాటాలు సృష్టించారు. వీటిలో క్యాన్సర్‌ వ్యాధిని, హృద్రోగాలను నిరోధించే ఆంతోసయానిన్‌ అనే పదార్థం, ఇతరత్రా బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. అంతేకాదు.. సాధారణ టమాటాల కంటే ఊదా టమాటాలను రెట్టింపు కాలం పాటు నిల్వ చేసి ఉంచొచ్చట.
 
ఎలుకలపై ప్రయోగాల్లో ఏం తేలిందంటే.. ? 

ఈ ఊదా టమాటాలను అభివృద్ధిచేసిన తర్వాత వాటిలోని ఔషధ గుణాలను తెలుసుకునేందుకు ఎలుకలపై ప్రత్యేక పరిశోధనలు నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా క్యాన్సర్ సోకిన ఎలుకలతో ఊదా టమాటాలు తినిపించారు. దీంతో వాటి జీవితకాలం గణనీయంగా పెరిగిందని వెల్లడైంది. ఇదే వ్యవధిలో సాధారణ టమాటాలు తిన్న క్యాన్సర్ బాధిత ఎలుకల కంటే.. ఊదా టమాటాలు తిన్న క్యాన్సర్ బాధిత ఎలుకల ఆయుష్షు పెరిగినట్లు సైంటిస్టులు గుర్తించారు. కాగా, బ్రిటన్ కు చెందిన Norfolk Plant Sciences అనే జన్యుమార్పిడి విత్తనాల కంపెనీ ఊదా టమాటా విత్తనాల అభివృద్ధి కి అనుమతులు కోరుతూ 2021 ఆగస్టులో ఔషధ నియంత్రణ సంస్థలకు దరఖాస్తు  సమర్పించింది. బ్రిటన్  గడ్డపై అభివృద్ధి చేసిన ఈ ఊదా టమాటాలను తొలుత అమెరికాలో వచ్చే ఏడాది నుంచి సాగు చేయనున్నారు. ఇప్పటివరకు బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థలు దీని సాగుకు అనుమతులు ఇవ్వలేదు.