- ఆయన మంత్రిగా ఉండగానే స్కీమ్‌లో భారీగా అవినీతి
- ఇద్దరు ఉన్నతాధికారుల డైరెక్షన్లోనే మొత్తం వ్యవహారం!
- మనీ ట్రాన్సాక్షన్లతో ఎంట్రీ ఇచ్చిన ఈడీ
- ఫైళ్లు ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌కు నోటీసులు
హైదరాబాద్, వెలుగు : గొర్రెల స్కామ్‌లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్(ఈడీ) ఎంటర్ కావడంతో గొర్రెల యూనిట్ల పంపిణీలో అక్రమ లావాదేవీలన్నీ వెలుగులోకి రానున్నాయి. చీటింగ్ కేసు ఎంక్వైరీతో మొదలైన ఈ వ్యవహారం ఈడీ దర్యాప్తు వరకు చేరుకుంది. అయితే పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఈ అక్రమాల ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందని అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఆయన మంత్రిగా ఉన్న టైమ్‌లోనే స్కీమ్ లో భారీగా అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రవేశపెట్టిన గొర్రెల యూనిట్ల పంపిణీ స్కీంతో గొల్ల కురుమల కంటే కొందరు పశుసంవర్ధక శాఖ అధికారులు, బ్రోకర్లే ఎక్కువగా బాగుపడ్డట్టు ఆరోపణలున్నాయి. వేలాది యూనిట్లను పేపర్ల మీదనే సృష్టించి పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొట్టారు. ఈడీ దర్యాప్తులో ఈ అక్రమాల చిట్టా మొత్తం వెల్లడయ్యే అవకాశం ఉంది.
700 కోట్ల అవినీతి...
గొర్రెల పంపిణీ స్కీం కింద బిల్లుల చెల్లింపుల్లో దాదాపు రూ.700 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. కొత్తగా ఈడీ కూడా ఇందులో ఎంటరైంది. పశు సంవర్ధక శాఖ నుంచి సంబంధిత ఫైళ్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఈడీ ఉంది. ఫైళ్లు ఇవ్వాలంటూ తాజాగా పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేయగా కొంత గడువు కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారం మారగానే గత జనవరిలో మాజీ మంత్రి తలసాని వద్ద ఓఎస్డీగా పని చేసిన కల్యాణ్ ఆఫీసులో ఉన్న గొర్రెల పంపిణీకి సంబంధించిన ఫైళ్లు చించేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత ఎంక్వైరీలో బయటపడుతున్న విషయాలతో ఈ వ్యవహారం తలసానికి కూడా చుట్టుకోనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
చక్రం తిప్పిన ఓ అధికారి..
బీఆర్ఎస్ హయాంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గా పనిచేసిన ఓ అధికారి, మాజీ మంత్రి ఓఎస్డీ కుమ్మక్కై ఈ స్కామ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అవినీతిలో ఎక్స్పర్ట్ అయిన ఆ అధికారిని పదవీకాలం ముగిశాక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరో స్కీంకు అడ్వైజర్ గా నియమించింది. ఇదే అధికారి తలసాని శ్రీనివాస్ కుమారుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు కింది అధికారుల నుంచి కోట్ల రూపాయలు వసూళ్లు చేసి ఎన్నికల్లో సహకరించారని అప్పట్లో డిపార్ట్మెంట్లో చర్చ జరిగింది.
ఆ నాలుగేండ్లలో భారీ అవినీతి..!
గొర్రెల పంపిణీ పథకం 2017 జూన్ 20న ప్రారంభం కాగా.. 2017–18 లోనే అత్యధికంగా 2.56 లక్షల యూనిట్లు పంపిణీ జరిగింది. 2018–19 లో 1.08లక్షల యూనిట్లు ఇచ్చారు. 2019–20లో 1,329యూనిట్లు, 2020–21లో 62 యూనిట్లు ఇలా మొత్తం 3.66లక్షల యూనిట్లు పంపిణీ జరిగింది. ఓవరాల్‌గా ఈ స్కీం కింద మొత్తం 4.25లక్షల యూనిట్లు పంపిణీ చేశారు. ఇందులో 86.2శాతం యూనిట్ల పంపిణీ అప్పటి షీప్ ఫెడరేషన్ ఎండీ, డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి తలసాని హయాంలోనే జరిగాయి. ఇందులోనే అవినీతి జరిగిందని, లారీల పేరుతో ఆటోలు, టూవీలర్ల నంబర్లు రాసి అవినీతికి పాల్పడ్డారనీ, ఆధారాలతో సహా కాగ్ తన రిపోర్టులో పేర్కొంది.
రూ.2 కోట్ల మోసంతో బయటపడ్డ కుంభకోణం
కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై గొర్రెలు అమ్మిన వారికి ఇవ్వాల్సిన డబ్బులను ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించి గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. గొర్రెలు అమ్ముకున్న ఏపీ రైతులకు డబ్బులు రాకపోవటంతో గత 2023 డిసెంబరు 26న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మోహినోద్దీన్ అనే కాంట్రాక్టర్‌పై కేసు నమోదైంది. ఇలా గొర్రెల స్కామ్ బయటపడగా, సర్కారు కేసును దర్యాప్తును ఏసీబీకి అప్పగించింది. ఎంక్వైరీ చేపట్టిన ఏసీబీ పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రాంచందర్, మాజీ మంత్రి ఓఎస్డీ కల్యాణ్ ను అదుపులోకి తీసుకుంది. రూ.700 కోట్ల భారీ అవినీతి కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా ఈడీ ఎంటర్ కావడంతో గొర్రెల స్కామ్ మరో మలుపు తిరిగింది.