- ఉత్తరాఖండ్లో ఘటన..
- ఆస్పత్రి నుంచి వెళ్తుండగా దారుణం
డెహ్రాడూన్: కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను మరువక ముందే అటువంటి ఉదంతమే ఆలస్యంగా మరొకటి వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్ నుంచి ఇంటికెళ్తున్న నర్సును ఓ దుండగుడు రేప్ చేసి హత్య చేశాడు. ఉత్తరాఖండ్ ఉధమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రాపూర్లో ఈ దారుణం జరిగింది. బాధితురాలు (33) నైనిటాల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. తన 11 ఏండ్ల కూతురితో కలిసి బిలాస్ పూర్ కాలనీలో నివసిస్తోంది. ఆమె జులై 30న అదృశ్యమైంది. దీంతో ఆమె సోదరి జులై 31న రుద్రాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఒక వారం తర్వాత ఉత్తరప్రదేశ్ లోని దిబ్దిబా ప్రాంతంలోని ఖాళీ స్థలంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. దానిని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నర్సును రేప్ చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆమె మొబైల్ ఫోన్ ను ట్రేస్ చేయగా నిందితుడు ధర్మేంద్ర పోలీసులకు చిక్కాడు. అతడిని బుధవారం రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ లో అరెస్టు చేశారు. ధర్మేంద్ర యూపీ బరైలీకి చెందిన కార్మికుడు. నర్సును పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నగలు, డబ్బు తీసుకుని పరారయ్యాడని పోలీసులు వెల్లడించారు.
