
న్యూఢిల్లీ : విమానం ఎక్కిన ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. ప్లేన్ టేకాఫ్ అయ్యాక టాయిలెట్‌కు వెళ్లిన అతడు.. డోర్ తెరచుకోకపోవడంతో అందులోనే చిక్కుకుపోయాడు. అలా తన డెస్టినేషన్‌కు చేరేదాకా గంటకుపైగా టాయిలెట్లోనే ప్రయాణం చేయాల్సివచ్చింది. విమానం ల్యాండ్ అయ్యాక వచ్చిన టెక్నీషియన్లు.. డోర్ పగలగొట్టి ఆ ప్రయాణికుడికి విముక్తి కల్పించారు. మంగళవారం ముంబై నుంచి బెంగళూరుకు ప్రయాణించిన స్పైస్ జెట్ విమానంలో ఈ ఘటన జరిగింది.
ఎంత ప్రయత్నించినా డోర్ ఓపెన్ కాలే..
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టాయిలెట్లోకి వెళ్లిన ప్యాసింజర్.. తిరిగి వచ్చేప్పుడు డోర్ లాక్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. ఇది గమనించిన క్యాబిన్ సిబ్బంది ఆ డోర్ తెరిచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో పరిస్థితి గురించి ఏయిర్ హోస్టెస్ ఓ చీటిపై రాసి డోర్ కింద నుంచి ప్రయాణికుడికి తెలియజేసింది. డోర్ బయటి నుంచి కూడా తెరుచుకోవట్లేదని, కంగారు పడొద్దని పలు సూచనలు చేసింది. అలా గంటకుపైగా గడిచాక విమానం బెంగళూరులోని కెంపెగౌడ ఏయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది.
టెక్నీషియన్లు వచ్చి డోర్ పగలగొట్టి ప్రయాణికుడిని బయటకు తీశారు. తీవ్ర ఆందోళనకు గురైన ఆ ప్యాసింజర్‌ను స్పైస్ జెట్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పైస్ జెట్ మేనేజ్మెంట్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుడికి కలిగిన ఇబ్బందికి క్షమాణలు తెలిపింది. డోర్ లాక్ లోపం కారణంగా ఈ ఘటన జరిగిందని, ఆయన టికెట్ డబ్బులు వాపస్ ఇస్తామని చెప్పింది. ఈ ఇన్సిడెంట్ పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా విచారణ ప్రారంభించింది.
ఈ మధ్య పొగమంచు కారణంగా రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించి.. టికెట్ డబ్బులు ఇప్పటివరకు స్పైస్ జెట్ తమకు వాపస్ ఇవ్వలేదని పలువురు ప్యాసింజర్ల నుంచి సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రతినిధులు.. తాము డిసెంబర్ వరకు రద్దయిన సర్వీసుల టికెట్ల డబ్బులన్నీ వాపస్ చేశామని తెలిపారు.