హైదరాబాద్: మొహరం పండుగకు అనుమతినివ్వాలని కోరుతూ హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది. గత నాలుగు వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాలను కాపాడాలని కోరుతూ శియా సంస్థ శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 30 తేదీన డబిర్పుర బిబికా అలావా నుంచి చాదర్ఘాట్ మజీద్ ఇలాహి వరకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏనుగు మీద ఎలాంటి ఊరేగింపులు జరపమని 12 మంది సిబ్బందితో 12 అలమ్‌లను డీసీఎం వాహనాల ద్వారా సమర్పిస్తామని తెలిపారు. గత మే నెలలో సుప్రీంకోర్టు జగన్నాథ రథయాత్రకు కేంద్రం అనుమతిచ్చిందని, తమకు కూడా అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు.
హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీ కుమార్‌కు ఇచ్చిన వినతి పత్రం ఇంకా పెండింగ్‌లో ఉందని పిటిషనర్ కోర్టు కు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. మొహరం పండుగ అనుమతుల కోసం ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిందని కోర్టుకు తెలిపింది. ఆగస్టు 31 తారీకు వరకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది.
ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. జగన్నాథ రథయాత్ర తీర్పు, మార్గదర్శకాలను పరిశీలించాలని నగర సీపీని ఆదేశించింది. అంతేకాకుండా అనుమతి కోసం ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్‌కు సూచించింది.
