ఏడేండ్లు ఏం చేశామో గడపగడపకు తెలిపేందుకే ప్రజా ఆశీర్వాద యాత్ర

ఏడేండ్లు ఏం చేశామో గడపగడపకు తెలిపేందుకే ప్రజా ఆశీర్వాద యాత్ర
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

కోదాడ (సూర్యాపేట జిల్లా): ఈ ఏడు ఏండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గడప గడపకు తెలిసేవిధంగా చేయడం కోసమే ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించడం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వెల్లడించారు. కోదాడ పట్టణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజా ఆశీర్వాద యాత్ర ను ప్రారంభించేందుకు విజయవాడ నుండి వస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సూర్యాపేట జిల్లాలోని కోదాడ సమీపంలోని రామాపురం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. 
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీలో కేవలం కష్టపడి పనిచేసిన వాళ్లకు మాత్రమే గౌరవం ఉంటుందన్నారు. దానికి ఉదహరణే కిషన్ రెడ్డి అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలలో కీలక భూమి పోషిస్తున్నారు కిషన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. 370 ఆర్టికల్ రద్దు విషయంలో,  బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఘనత కిషన్ రెడ్డిదని ఆయన అన్నారు. 
కష్టపడి పని చేసాడు కాబట్టే కేంద్రమంత్రి గా అవకాశం వచ్చింది
కార్యకర్త నుంచి మొదలుపెట్టి ఏ బాధ్యత ఇచ్చినా కష్టపడి పనిచేశాడు కాబట్టే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.  దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడు ఏండ్లలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గడప గడపకు తెలిసే విధంగా ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా తీసుకెళ్లాలని ఈరోజు ఈ యాత్ర చేస్తున్నామన్నారు. సామాన్య కార్యకర్తని ప్రధాన మంత్రిని చేయడం బీజేపీలోనే సాధ్యమన్నారు. సంక్షేమ పథకాలు పెట్టి ఆగమాగం అవుతున్నది కేసీఆర్ అన్నారు. వందేమాతరం నినాదానికి భయపడి ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి గల్లీలకు వస్తున్నాడని, ముఖ్య పదవులు అన్నీ కుటుంబానికి తప్ప వేరే వాళ్లకు ఇవ్వలేదని కేసీఆర్ తీరును ఎండగట్టారు. బీజేపీ బీసీలకు, దళితులకు, గిరిజనులకు సమాన ప్రాతినిధ్యం ఇస్తుందన్నారు. 
తెలంగాణ తల్లి తనను బంధ విముక్తి చేయాలని రోదిస్తోంది 
తెలంగాణ తల్లి తనను బంధ విముక్తి చేయాలని రోదిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మలి దశ ఉద్యమం  ద్వారా గడీల గోడలను బద్దలు కొట్టడానికి ప్రతి బీజేపీ కార్యకర్తల తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరం కష్టపడి పనిచేసి పార్టీకి అండగా ఉందామని కోరారు. తెలంగాణ గడ్డ పైన కాషాయ జెండా ఎగరేయడానికి ప్రతి కార్యకర్త కదలి రావాలని సూచించారు.