గురుకుల పాఠశాల ముందు తల్లిదండ్రులు, ప్రజాసంఘాల ధర్నా

గురుకుల పాఠశాల ముందు తల్లిదండ్రులు, ప్రజాసంఘాల ధర్నా

సోషల్​ వెల్ఫేర్​ హాస్టల్​ భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి చెందిన ఘటనపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయగా.. తమ కూతురిని హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై అనుమానం వ్యక్తం చేస్తూ సరూర్ నగర్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురుకుల పాఠశాల ముందు తల్లిదండ్రులతో కలసి ప్రజాసంఘాల ధర్నా నిర్వహించాయి. విద్యార్థి మృతికి  కారణాలు బయటకు రావాలని, కలెక్టర్, సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద  మృతి  కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. 

బాలికల సోషల్​ వెల్ఫేర్​ హాస్టల్​ భవనంపై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందిన ఘటన సరూర్​నగర్​ పీఎస్​లో గురువారం చోటు చేసుకుంది. కృష్ణవేణి క్యాంపస్​ ​లో కొనసాగుతున్న ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్​ స్కూల్లో సూర్యాపేట జిల్లా నూతనకల్​కు చెందిన బాలిక 9వ తరగతి చదువుతున్నది. హాస్టల్​ సెకండ్​ ఫ్లోర్​ నుంచి బాలిక కిందపడింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను మలక్​పేటలోని గవర్నమెంట్​ హాస్పిటల్​కు తీసుకెళ్లగా.. అక్కడి డాక్టర్లు యశోదకు రెఫర్​ చేశారు. అక్కడకు తీసుకెళ్లే సరికి బాలిక చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. తోటి విద్యార్థినులను పోలీసులు విచారించగా.. తాను ఎప్పుడూ ఒంటరిగా ఉండేదని చెప్పారు. దీంతో ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని​ పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఉస్మానియాలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, స్కూల్​ ప్రిన్సిపాల్​ కారణంగానే తమ కూతురు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కూతురు మృతిపై అనుమానాలున్నాయని ఆరోపించారు. హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు.