అమెరికాలో బుద్ధుడి పురాతన విగ్రహం చోరీ

అమెరికాలో బుద్ధుడి పురాతన విగ్రహం చోరీ
  • అమెరికాలో బుద్ధుడి పురాతన విగ్రహం చోరీ
  • ఈ కళాఖండం విలువ రూ.12 కోట్లు ఉంటుందని అంచనా 

వాషింగ్టన్ : అమెరికాలో బుద్ధుడి అరుదైన కాంస్య విగ్రహం చోరీకి గురైంది. ఈ పురాతన కళాఖండాన్ని లాస్​ ఏంజిల్స్​లోని ఆర్ట్​ గ్యాలరీ నుంచి ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. దాని విలువ రూ.12.5 కోట్లు ఉంటుందని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. జపాన్​లో ఎడో కాలానికి(1603–1867) చెందిన ఆ విగ్రహం 114 కిలోల బరువు, 4 అడుగుల ఎత్తు ఉంటుందని పేర్కొంది. ఈ నెల 18న బెవర్లీ గ్రోవ్​లోని బరాకత్​ గ్యాలరీలో తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో చోరీ జరిగిందని పోలీసులు వివరించారు. 

దుండగుడు ఒక్కడే అంత బరువున్న విగ్రహాన్ని ఎత్తుకెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దొంగ ఒక్కడే గేటులోపలికి వచ్చినట్లు సీసీటీవీలో రికార్డయిందని చెప్పారు.  గ్యాలరీలోని ఓపెన్ ఏరియాలో ఉన్న విగ్రహాన్ని డాలీలో పెట్టి లాక్కెళ్లి ట్రక్కులోకి ఎక్కించాడని వివరించారు. చోరీకి గురైన బుద్ధుడి స్మారక కాంస్య శిల్పం ఒకప్పుడు జపాన్​లోని ప్రసిద్ధ యుడొనొశాన్ పుణ్యక్షేత్రంలో ప్రతిష్టించినదని శాసనాల ద్వారా తెలుస్తోంది.